Last Updated:
డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈగల్ ఫోర్స్ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, టోల్ ఫ్రీ 1908 ద్వారా కఠిన చర్యలు చేపడుతోంది
డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు ఎస్పీ చంద్రయ్య ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పద్మనాయక కల్యాణ మండపం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, యువత, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థులు, సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థులు డ్రగ్స్ దుష్ప్రభావాలపై నిర్వహించిన ప్రదర్శనలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సే నో టు డ్రగ్స్.. సే యెస్ టు లైఫ్ అంటూ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత, విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. “మత్తు పదార్థాల బాటను వీడి.. మైదానం బాట పట్టండి అనే సీఎం రేవంత్ రెడ్డి పిలుపును యువత ఆచరణలో పెట్టాలని కోరారు. యువత చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ వంటి కార్యక్రమాల ద్వారా యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమకు నచ్చిన రంగంలో ప్రతిభ కనబరచాలని సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడితో బాధపడేవారు నిపుణుల సలహా తీసుకోవాలని, డ్రగ్స్‌కు బానిసైన వారిని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని డీ-అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.
డ్రగ్స్ వ్యాప్తి చేసే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి విద్యాసంస్థ, ప్రతి మున్సిపాలిటీని డ్రగ్స్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఎవరైనా మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1908, కంట్రోల్ రూం 8712671111 లేదా అత్యవసర సేవల 112కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Karimnagar,Telangana
