Last Updated:
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు కలిగిన ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇకపై రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చడం, తొలగించడం, కుటుంబ విభజన వంటి సేవలను మరింత సులభంగా పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు కలిగిన ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇకపై రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చడం, తొలగించడం, కుటుంబ విభజన వంటి సేవలను మరింత సులభంగా పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వేగంగా సేవలు అందేలా వ్యవస్థను మెరుగుపర్చాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుతున్న డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
సచివాలయంలోని ఆర్బీజీఎస్ (RTGS) కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నారా లోకేష్ పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించిన సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చడం, మరణించిన లేదా ఇతర కారణాలతో పేర్లు తొలగించడం, కుటుంబ విభజన కారణంగా కొత్త రేషన్ కార్డు జారీ చేయడం వంటి సేవలను త్వరగా, పారదర్శకంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇక ప్రభుత్వ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్ సర్టిఫికేట్), కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్) వంటి కీలక పత్రాల జారీలో ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించి ప్రజలకు నిర్ణీత సమయంలో సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చే ‘డేటా లేక్’ పనులను జూలై నెలలోగా పూర్తి చేయాలని కూడా స్పష్టం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని లోకేష్ సూచించారు. ఈ సేవలపై రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యాసంస్థలు, క్రీడా సంస్థలు జారీ చేసే సర్టిఫికెట్లను అభ్యర్థి ఆధార్ నంబర్ ఆధారంగా డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా పారదర్శకంగా ధ్రువీకరించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సర్టిఫికెట్లు, రేషన్ సేవలు, ఇతర పౌర సేవలను పొందే అవకాశం కల్పించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతోంది. అయితే ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు వంటి కొన్ని సేవల కోసం అవసరమైన బయోమెట్రిక్ ధృవీకరణ కారణంగా గ్రామ, వార్డు సచివాలయాలను కూడా వినియోగించుకోవచ్చు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తృతంగా అమలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలను ఈ వ్యవస్థతో అనుసంధానం చేయడం ద్వారా ప్రజలకు ఒకే వేదికపై అనేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సేవల పారదర్శకత కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో రేషన్ కార్డు సేవలను మరింత వేగవంతంగా, సులభంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
Hyderabad,Telangana

