Last Updated:
Stock Market Today: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈరోజు కొన్ని కీలక షేర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ EMS రంగంపై తాజా నివేదిక విడుదల చేసింది. రెండు నెలల్లో 31 శాతం వరకు పడిపోయిన షేర్లపై తన అభిప్రాయాలను వెల్లడించింది. మరోవైపు జైడస్ లైఫ్‌సైన్సెస్, కళ్యాణ్ జ్యువెలర్స్, JSW ఇన్ఫ్రా షేర్లపై కూడా బ్రోకరేజీలు కీలక అంచనాలు ప్రకటించాయి.
ఈరోజు ఫోకస్ చేయాల్సిన EMS రంగానికి చెందిన స్టాక్స్ ఇవే. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ ఈ రంగంపై తాజా నివేదిక విడుదల చేసింది. గత రెండు నెలల్లో EMS రంగం 9 శాతం నష్టపోగా, ఇదే సమయంలో నిఫ్టీ 10 శాతం లాభపడింది. ఈ కాలంలో అవలోన్ టెక్నాలజీస్, సైయంట్ DLM, కేన్స్ టెక్నాలజీ, సిర్మా SGS షేర్లు వరుసగా 31 శాతం, 22 శాతం, 22 శాతం, 17 శాతం పడిపోయాయి. మరోవైపు డిక్సన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్ షేర్లు స్థిరంగా కొనసాగాయి. సిర్మా SGS, అవలోన్ టెక్నాలజీస్‌పై రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసి న్యూట్రల్‌కు మార్చిన జేపీ మోర్గాన్.. డిక్సన్ టెక్నాలజీస్‌ను తన టాప్ పిక్‌గా ఎంపిక చేసింది. పెట్టుబడిదారులు కేవలం ఆదాయ వృద్ధిపైనే కాకుండా మార్జిన్ల మెరుగుదల, నగదు ప్రవాహాలు, పెట్టుబడులపై రాబడి నిష్పత్తులను కూడా పరిశీలించాలని సూచించింది. ఈ నివేదికలో డిక్సన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగా, తర్వాత అంబర్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఓవర్‌వెయిట్ రేటింగ్‌తో రెండో స్థానం ఇచ్చింది. ఆ తర్వాత కేన్స్ టెక్నాలజీ, అవలోన్ టెక్నాలజీస్, సిర్మా SGS, సైయంట్ DLM షేర్లకు వరుసగా ప్రాధాన్యత ఇచ్చింది. సిర్మాపై న్యూట్రల్, సైయంట్ DLMపై అండర్‌వెయిట్ అభిప్రాయాన్ని కొనసాగించింది.
జైడస్ లైఫ్‌సైన్సెస్ (Zydus Lifesciences): జైడస్ లైఫ్‌సైన్సెస్‌పై జేపీ మోర్గాన్ న్యూట్రల్ రేటింగ్ కొనసాగిస్తూ ఒక్కో షేరుకు రూ.1,250 టార్గెట్ ధరను నిర్ణయించింది. కంపెనీకి చెందిన సరోగ్లిటాజార్ ఔషధానికి సంబంధించి అమెరికా FDA నుంచి కంప్లీట్ రెస్పాన్స్ లెటర్ (CRL) అందింది. 2026 అక్టోబర్‌లో మొరాయా ప్లాంట్ తనిఖీ సందర్భంగా FDA గుర్తించిన లోపాలను పరిష్కరించిన తర్వాతే అనుమతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 2026లో నిర్ణయించిన PDUFA గడువు దాటడంతో ఆమోదం ఆలస్యమైంది. అయితే సకాలంలో లోపాలను సరిచేస్తే 2027 మార్చి-ఏప్రిల్ మధ్య వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఈ ఔషధం ద్వారా FY28లో 9 మిలియన్ డాలర్లు, FY29లో 63 మిలియన్ డాలర్ల ఆదాయం రావచ్చని అంచనా. మొరాయా ప్లాంట్ కంపెనీ మొత్తం ఆదాయంలో 13 శాతం వాటా కలిగి ఉంది.
కళ్యాణ్ జ్యువెలర్స్ (Kalyan Jewellers): కళ్యాణ్ జ్యువెలర్స్‌పై HSBC బై రేటింగ్ కొనసాగిస్తూ ఒక్కో షేరుకు రూ.830 టార్గెట్ ధరను ఇచ్చింది. కంపెనీ ప్రారంభించిన Affordable Gold Jewellery ఆధారిత ATM బ్రాండ్‌పై బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది. తక్కువ మేకింగ్ ఛార్జీలతో వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం తమ ఆదాయ అంచనాల్లో ఈ కొత్త బ్రాండ్‌ను చేర్చలేదు. ఈ బ్రాండ్‌ను కంపెనీ సమర్థంగా విస్తరించి మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తులో అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని HSBC పేర్కొంది. అధిక బేస్ ఉన్నప్పటికీ బంగారు ఆభరణాలకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని తెలిపింది.
JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ (JSW Infrastructure): JSW ఇన్ఫ్రాపై HSBC తగ్గించు (Reduce) రేటింగ్ ఇచ్చింది. ఒక్కో షేరుకు రూ.280 టార్గెట్ ధరను నిర్ణయించింది. FY28 నాటికి కంపెనీ విస్తరణ, ప్రాజెక్టుల అమలు ప్రణాళికలు నిర్దేశించిన ప్రకారం కొనసాగుతున్నాయని బ్రోకరేజ్ తెలిపింది. జటాధర్ ప్రాజెక్టు ద్వారా JSW స్టీల్ వృద్ధి అవకాశాలకు అనుగుణంగా లాజిస్టిక్స్ వ్యాపారంలోనూ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. కంటైనర్ వ్యాపారం కూడా కంపెనీ వృద్ధికి కొత్త అవకాశాలను అందించనుంది. అయితే భారీ మూలధన వ్యయం కారణంగా పెట్టుబడులపై రాబడి ప్రస్తుతం తక్కువగా ఉండే అవకాశం ఉందని HSBC అభిప్రాయపడింది. పోర్టుల వినియోగ సామర్థ్యం, పెట్టుబడులపై రాబడి వంటి అంశాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాలని సూచించింది.

