Last Updated:
నా దగ్గర పైసల్లేవని చివరకు గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలేసింది అని చెబుతూ తన కెరీర్ సీక్రెట్స్ బయటపెట్టాడు విశ్వక్ సేన్. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్లో ‘మాస్ కా దాస్’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు విశ్వక్సేన్, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను, అవమానాలను తాజాగా గుర్తు చేసుకున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఈఎన్ఈ: రిపీట్’ (ENE: Repeat) ఇటీవల విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్ లో పాల్గొన్న విశ్వక్సేన్.. తన సినీ ప్రయాణాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యారు.
సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో తన దగ్గర డబ్బుల్లేవనే కారణంతో గర్ల్‌ఫ్రెండ్ కూడా వదిలేసి వెళ్లిపోయిందని విశ్వక్ అన్నారు. “కేవలం 17 ఏళ్ల వయసులోనే ఫిల్మ్ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టా. ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకునేవాడిని కాదు. అలా దాదాపు నాలుగేళ్ల పాటు ఛాన్సుల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నా. ఆ కష్టకాలంలో నాకో గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. కానీ, నా దగ్గర డబ్బులు లేవని ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయింది” అని తన వ్యక్తిగత జీవితంలోని చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు.
ఆ తర్వాత వృత్తిపరంగా ఎదురైన అవమానాల గురించి చెబుతూ.. “అవకాశాల కోసం తిరుగుతున్న క్రమంలో నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా ప్రారంభించారు. అయితే రెండో నెల అయ్యేసరికి నన్ను రెండో హీరోను చేశారు. మూడో నెలకు మూడో హీరోగా మార్చారు. నాలుగో నెలలో నాలుగో హీరోను చేస్తే ఇక సినిమా మానేద్దామనుకున్నా. కానీ వాళ్లు నిజంగానే నన్ను నాలుగో హీరోను చేశారు. అయినా అవమానాలన్నీ దిగమింగుకుని, నోరు మూసుకుని సినిమా చేయడం మొదలుపెట్టా. చివరకు నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచే తీసేశారని 20 రోజుల తర్వాత తెలిసింది. అప్పటివరకు అప్పులు చేసి మరీ వాళ్లకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ వచ్చాను. ఆ రోజు ఇంటికి వెళ్లి ఎక్కి ఎక్కి ఏడ్చా” అని విశ్వక్ తన గతాన్ని వివరించారు.
ఆ క్లిష్ట పరిస్థితులే తనలో కసిని పెంచాయని విశ్వక్ తెలిపారు. అదే సమయంలో ఒక మలయాళ సినిమా చూసి స్ఫూర్తి పొంది, స్వయంగా దర్శకత్వం వహిస్తూ ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రాన్ని ప్రారంభించానని చెప్పారు. సరిగ్గా అప్పుడే తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్లానని, తరుణ్ కేవలం 20 నిమిషాల్లో కథ చెప్పగానే తన జీవితంలో జరుగుతున్న సంఘటనలే అందులో రాసినట్లు అనిపించిందని అన్నారు. 2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ తన కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పిందని, ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన ‘ఈఎన్ఈ: రిపీట్’ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించడం ఎంతో ఆనందంగా ఉందని విశ్వక్సేన్ పేర్కొన్నారు.

