Last Updated:
ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆదివారం నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర బాలెన్ షా ఆదివారం నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో అధికారిక పర్యటన జరపనున్నారు. 2026 మార్చిలో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. నవంబర్ 22 మధ్యాహ్నం 34 మంది సభ్యుల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన న్యూఢిల్లీకి చేరుకుంటారు. ఆదివారం సాయంత్రం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నేపాల్ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సోమవారం (నవంబర్ 23) ప్రధాని మోదీతో బాలేంద్ర షా కీలక ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ ఆయన భేటీ కానున్నారు.
గత ఆగస్టులో నేపాల్‌లో సంభవించిన హిమనీనద వరదల వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో నేపాల్ పునర్నిర్మాణం, ఇంధన రంగం, రవాణా కనెక్టివిటీ, వ్యాపార సంబంధాల బలోపేతంపై ఇరు దేశాల ప్రధానులు ప్రధానంగా చర్చించనున్నారు. ఈ పర్యటనలో భారత్ తరఫున నేపాల్‌కు సుమారు 2 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే, విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్‌తో పాటు 52 మందితో కూడిన వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఢిల్లీకి వస్తోంది. భారత్-నేపాల్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొని ఇరు దేశాల మధ్య పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నేపాల్ ప్రధాని అడుగులు వేస్తున్నారు. ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానంలో భాగంగా భారత్ ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

