వాయు కాలుష్యం వల్ల చిన్నపిల్లల ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లల్లో ఊపిరితిత్తులు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటాయి. వాహనాల పొగ, నిర్మాణ పనుల వల్ల వచ్చే దుమ్ము, సూక్ష్మ ధూళి కణాలు, రసాయన పదార్థాలు వారి శ్వాసనాళాలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా దగ్గు, ఛాతీలో గురగుర శబ్దాలు, ఆయాసం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గతంలోనే ఆస్తమా లేదా అలర్జీ సమస్యలు ఉన్న పిల్లల్లో ఈ లక్షణాలు మరింత తీవ్రంగా మారవచ్చు. వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల కూడా దీర్ఘకాలిక దగ్గు వచ్చే అవకాశం ఉంది.
పిల్లలకు తరచూ దగ్గు వస్తున్నా, దాని తీవ్రత పెరుగుతున్నా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ తుషార్ పారిఖ్ సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ దగ్గు ఎక్కువ కావడం, ఛాతీలో గురగుర శబ్దాలు రావడం, ఆడుతున్నప్పుడు లేదా పరిగెత్తుతున్నప్పుడు ఆయాసం రావడం వంటివి ఆస్తమా లేదా అలర్జీకి సంకేతాలు కావచ్చు.
కొన్నిసార్లు సాధారణ జలుబు లక్షణాలతో ప్రారంభమైన సమస్య న్యుమోనియాకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి దగ్గు వాయు కాలుష్యం వల్లే వస్తుందని భావించడం సరికాదు. దగ్గుకు అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.
రెండు నుంచి మూడు వారాలకు మించి దగ్గు కొనసాగితే దానికి గల కారణాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా టీబీ వచ్చే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఛాతీ ఎక్స్రే, వైద్యులు సూచించే ఇతర పరీక్షల ద్వారా సమస్యను గుర్తించవచ్చు.
పిల్లల్లో వేగంగా శ్వాస తీసుకోవడం, ఊపిరి పీల్చుకునేటప్పుడు ఛాతీ లోపలికి లాగినట్లు కనిపించడం, పెదవులు నీలం రంగులోకి మారడం, పాలు తాగడానికి ఇబ్బంది పడటం, అసాధారణంగా నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
పెరుగుతున్న కాలుష్యం చిన్నపిల్లలతో పాటు పెద్దలు, వృద్ధుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతోంది. గత 15 నుంచి 20 రోజులుగా ఆసుపత్రి ఓపీడీకి నిరంతర దగ్గు, గొంతులో గరగర, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలతో పిల్లలు చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. కలుషిత గాలిని పీల్చడం వల్ల శ్వాసనాళాల్లో వాపు, అలర్జీలు పెరగవచ్చు. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు మరింత తీవ్రం కావచ్చు. దీనివల్ల నిద్ర, శారీరక చురుకుదనం, రోజువారీ పనులపైనా ప్రభావం పడుతుంది.
వాయు కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి: గాలి నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదు. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తే సరైన మాస్క్ ధరించాలి. పిల్లలను కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆడుకోవడానికి పంపకూడదు. సిగరెట్ పొగకు పిల్లలను దూరంగా ఉంచాలి. చేతులను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తగినంత నీరు తాగాలి. వయసుకు తగిన టీకాలను సమయానికి వేయించాలి. వైద్యుల సలహా లేకుండా దగ్గు మందులు, యాంటీబయాటిక్స్ వాడకూడదు.
ముఖ్యంగా దగ్గు రెండు వారాలకు మించి కొనసాగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముందుగానే సమస్యను గుర్తిస్తే తగిన చికిత్స తీసుకోవడం సులభమవుతుంది.
