Last Updated:
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నట ప్రస్థానంపై ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ ప్రశంసల వర్షం కురిపించారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నట ప్రస్థానంపై ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ ప్రశంసల వర్షం కురిపించారు. 1984లో తాను దర్శకత్వం వహించిన ‘సారాంశ్’ సినిమాలో బి.వి. ప్రధాన్ పాత్రతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన అనుపమ్ ఖేర్.. ఇప్పుడు ‘రామాయణ’ సినిమాలో జటాయువు పాత్ర వరకు చేరుకోవడాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు ఓ హృదయపూర్వక లేఖ రాశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న అనుపమ్ నట ప్రయాణం, ఆయనలో వచ్చిన మార్పులు, ఎదుగుదల గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
మహేశ్ భట్ తన లేఖలో.. ‘సారాంశ్’లో బి.వి. ప్రధాన్ పాత్ర నుంచి ‘రామాయణ’లో జటాయువు పాత్ర వరకు నీ ప్రయాణం అద్భుతం. నీ ఎదుగుదల నిరంతరం కొనసాగుతూనే ఉంది. నిన్ను చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటీవల స్వీడన్లో నిన్ను చూసినప్పుడు నీలో ఏదో ప్రత్యేకమైన మార్పు కనిపించింది. ఆ అనుభవం నీ వ్యక్తిత్వంలో భాగమైందనిపించింది. ఇతరులతో నువ్వు మాట్లాడుతున్న తీరు, వారికి చేయి అందిస్తున్న విధానం, ఎదుటివారికి ఇచ్చే గౌరవం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. గతంలో ఎన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో, స్వేచ్ఛగా కనిపిస్తున్నావు’ అని ప్రశంసించారు.
అంతేకాదు.. ‘సారాంశ్’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని కూడా మహేశ్ భట్ గుర్తుచేసుకున్నారు. కొడుకు అజయ్ చితాభస్మాన్ని వదిలేసిన తర్వాత పార్కులో పిల్లలతో ఆడుకుంటున్న ఓ వృద్ధురాలిని ప్రధాన్ చూసే సన్నివేశం తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పారు. జీవితంలో ఎదురైన అనుభవాలు అనుపమ్లో ఎంతో పరిణతిని తీసుకొచ్చాయని, ఆ మార్పు ఆయన కళ్లలో, శరీర భాషలో, హృదయంలో కనిపిస్తోందని పేర్కొన్నారు.
అలాగే పాలి హిల్‌లోని తన ఇంటి ఆవరణలో 28 ఏళ్ల నటుడు, 34 ఏళ్ల దర్శకుడు తొలిసారి మాట్లాడుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. ‘ఆ రోజు మనిద్దరం ఒకరికొకరం ఏమిచ్చుకున్నామో నాకు తెలియదు. కానీ ఆ తర్వాత నీ ప్రయాణం ఇంత అద్భుతంగా సాగుతుందని ఊహించలేదు. ఒకప్పుడు నీ చేయి పట్టుకున్న వ్యక్తిగా.. ఇప్పుడు నేను చూపించలేని గమ్యాలకు నువ్వు చేరుకోవడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న యువకుడు నిన్ను చూసి తన కలలను నిజం చేసుకోవడానికి ముంబైకి రావాలని ధైర్యం తెచ్చుకుంటాడు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి?’ అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు.
మహేశ్ భట్ రాసిన ఈ లేఖకు అనుపమ్ ఖేర్ కూడా ఎంతో భావోద్వేగంగా స్పందించారు. తన జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఇదొకటని పేర్కొన్నారు. 42 ఏళ్ల తన సినీ ప్రయాణానికి మహేశ్ భట్ రాసిన లేఖ అత్యంత అందమైన ప్రశంసాపత్రం లాంటిదని చెప్పారు.
‘నా మొదటి సినిమా సారాంశ్‌తో నన్ను పరిచయం చేసిన దర్శకుడిగానే కాకుండా.. మీరు నాకు గురువు, స్నేహితుడు, మార్గదర్శి. మీలాంటి గొప్ప దర్శకుడు, రచయిత నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. నాపై నమ్మకం ఉంచినందుకు, నా ప్రయాణాన్ని ఇంత గొప్పగా గుర్తించినందుకు ధన్యవాదాలు. మీరు గర్వపడేలా మరిన్ని మంచి పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు ఇలాంటి లేఖలు మీ నుంచి అందుకునేలా కష్టపడతాను’ అంటూ అనుపమ్ ఖేర్ తన కృతజ్ఞతలు తెలియజేశారు.
మొత్తంగా ‘సారాంశ్’తో మొదలైన అనుపమ్ ఖేర్ సినీ ప్రయాణం.. ఇప్పుడు ‘రామాయణ’లో జటాయువు పాత్ర వరకు చేరుకోవడం, ఈ క్రమంలో ఆయనకు తొలి అవకాశం ఇచ్చిన మహేశ్ భట్ ఇంతటి ప్రశంసలు అందించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. 42 ఏళ్ల అనుబంధం, గురువు-శిష్యుల మధ్య ఉన్న గౌరవం ఈ లేఖలో మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

