Last Updated:
ఒకప్పుడు దేశంలో పేదరికం తొలగించడమే ప్రధాన నినాదంగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. అయితే ఇప్పుడు భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోందని అన్నారు. ఈ సందర్భంగా మీడియా రంగంలో వచ్చిన మార్పులు, జర్నలిస్టుల బాధ్యతలు, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంపైనా మోదీ మాట్లాడారు.
World Bank Poverty Report 2026: ఒకప్పుడు ఎర్రకోట వేదికగా ‘గరీబీ హటావో’ (పేదరికాన్ని తొలగించండి) అనే నినాదం తరచూ వినిపించేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే ఇప్పుడు దేశంలో పేదరికం తగ్గింపునకు సంబంధించిన లెక్కలు భారీ మార్పును చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. గురువారం నిర్వహించిన దీపావళి మిలన్ కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు.
ప్రపంచ బ్యాంకు 2026 అక్టోబర్‌లో విడుదల చేసిన ‘పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్’ నివేదికలో 2011 నుంచి 2023 మధ్య కాలానికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఈ అంచనాల ప్రకారం రోజుకు 4.20 డాలర్ల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకునే దిగువ మధ్య ఆదాయ దేశాల పేదరిక పరిమితిని దాదాపు 49.6 కోట్ల మంది దాటారు. ఇదే సమయంలో తీవ్ర పేదరికం రేటు కూడా 27.1 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోయినట్లు నివేదిక తెలిపింది. అయితే ఈ రెండు గణాంకాలు వేర్వేరు ప్రమాణాలను సూచిస్తాయి. 49.6 కోట్ల మంది సంఖ్య 4.20 డాలర్ల పరిమితికి సంబంధించినది కాగా, తీవ్ర పేదరికాన్ని రోజుకు 3 డాలర్ల ప్రమాణంతో లెక్కించారు. ఈ రెండు లెక్కలకూ 2021 కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) ప్రాతిపదికగా ఉంది.
జర్నలిస్టులతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని కూడా ప్రధాని గుర్తుచేసుకున్నారు. బీజేపీలో తొలినాళ్లలో దీపావళి మిలన్ కార్యక్రమాలకు వచ్చే విలేకరుల కోసం కుర్చీలు ఏర్పాటు చేయడం, ఇతర ఏర్పాట్లు చూసుకోవడం తన బాధ్యతగా ఉండేదని తెలిపారు. ఒకప్పుడు పత్రికా ప్రకటన పంపాలంటే ఫ్యాక్స్ యంత్రం కోసం వెతకాల్సి వచ్చేదని, ఇప్పుడు సామాజిక మాధ్యమాలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకు మీడియా ప్రయాణం విస్తరించిందని వివరించారు.
సాంకేతికత కారణంగా వార్తల సేకరణ, ప్రసార విధానాలు పూర్తిగా మారాయని మోదీ అన్నారు. గతంలో బయట ప్రసారాల కోసం ఉపయోగించే ఓబీ వ్యాన్లు నిర్వహించే పనుల్లో చాలా వరకు ఇప్పుడు మొబైల్ ఫోన్లతోనే సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. “నేడు మొబైల్ ఫోనే ఓబీ వ్యాన్‌గా మారింది” అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత వార్తా ఛానళ్లు, పాడ్‌కాస్ట్‌లు పెరగడంతో దాదాపు ప్రతి అంశంపై ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఏర్పడిందన్నారు. గతంలో క్రికెట్ విశ్లేషకులు ఎక్కువగా కనిపించేవారని, ఇప్పుడు ప్రతి వీధిలోనూ వార్తలు, సమకాలీన అంశాలపై మాట్లాడేవారు ఉన్నారని చమత్కరించారు. భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి అవసరమని, ప్రజా చర్చను కొనసాగించడంలో భారత మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.
దేశం సాధించిన విజయాలను ప్రపంచానికి పరిచయం చేసే కథనాలకు మీడియా మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ కోరారు. భారత్‌లో ఇప్పటికే ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయని, వాటిని అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరవేయాలని సూచించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంపై కూడా ప్రజల్లో అవగాహన పెంచాలని జర్నలిస్టులను కోరారు.
క్షేత్రస్థాయిలో వార్తల సేకరణ కోసం వెళ్లే విలేకరులు ఎదుర్కొనే ఇబ్బందులను, కొన్నిసార్లు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాల్సి వస్తుందని ఆయన గుర్తించారు. వార్తలకు గడువు ఎంత ముఖ్యమో, దేశాభివృద్ధికి కూడా లక్ష్యం, గడువు అవసరమని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా మారాలనే లక్ష్యంతో దేశం పనిచేస్తోందని, “ప్రెస్‌కైనా, దేశానికైనా గడువు అవసరం. మన ముందున్న గడువు 2047” అని మోదీ పేర్కొన్నారు.

