Last Updated:
స్టాక్ మార్కెట్‌లో బుధవారం భారీ ర్యాలీ కనిపించింది. సెన్సెక్స్ ఏకంగా 1,350 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 25,400 మార్కును దాటింది. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపరులు భారీగా షేర్లు కొనుగోలు చేయడం మార్కెట్ జోరుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో బుధవారం మంచి లాభాలు వచ్చాయి. సెలవు తర్వాత ప్రారంభమైన మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) భారీగా షేర్లు కొనుగోలు చేయడం మార్కెట్ జోరుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. బుధవారం ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,351.64 పాయింట్లు (1.67 శాతం) పెరిగి 82,458.29 వద్ద ట్రేడయింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 365.55 పాయింట్లు (1.46 శాతం) లాభపడి 25,410.20 స్థాయికి చేరుకుంది. దీంతో రెండు ప్రధాన సూచీలు ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. మనీకంట్రోల్ కథనం ప్రకారం మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణాలివే.
1. తగ్గిన ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం భారత స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌కు 89.16 డాలర్లకు పడిపోయింది. ఇది రెండు నెలల కనిష్ఠ స్థాయి. ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని అమెరికా అధికారులు సంకేతాలు ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనలు తగ్గాయి. అయితే బుధవారం బ్రెంట్ క్రూడ్ ధర 0.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 92 డాలర్లకు చేరుకుంది.
విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐలు) భారత స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడం కూడా మార్కెట్ పెరుగుదలకు మరో ముఖ్యమైన కారణం. వీరు ఏకంగా రూ.7,212 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. విదేశీ పెట్టుబడులు పెరగడం వల్ల మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు కనిపించింది.
3. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
ఆసియా మార్కెట్లలోనూ ఎక్కువగా లాభాల ట్రేడింగ్ కనిపించింది. ఎంఎస్‌సీఐ ఆసియా పసిఫిక్ ఇండెక్స్ 0.8 శాతం వరకు పెరిగింది. జపాన్‌కు చెందిన నిక్కీ 225 సూచీ 0.8 శాతం లాభపడగా, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ 0.6 శాతం పెరిగింది. అయితే చైనా మార్కెట్లు మాత్రం నష్టాల్లో ట్రేడయ్యాయి. హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ సూచీ 0.8 శాతం తగ్గగా, షాంఘై కాంపోజిట్ 0.2 శాతం పడిపోయింది. మరోవైపు మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయిన తర్వాత, బుధవారం అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ మళ్లీ కోలుకున్నాయి. నాస్‌డాక్ 100 ఫ్యూచర్స్ 0.6 శాతం పెరిగాయి. దీంతో అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో వచ్చిన నష్టాల్లో చాలావరకు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించింది. ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ కూడా లాభాల్లోకి వచ్చాయి.

