Last Updated:
Murder: రాత్రి భోజనం వేళ కూర రుచిగా లేదని ప్రశ్నించినందుకు ఓ భార్య క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కట్టుకున్న భర్తనే కత్తితో పొడిచి హత్య చేసిన దారుణ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని నరోడా స్మార్ట్ సిటీ-2 ప్రాంతంలో దిలీప్ ఖరాడి (39), నిర్మలా ఖరాడి (34) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. మాజీ సైనికుడైన దిలీప్, ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GMDC)లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
రోజూలాగే రాత్రి పని ముగించుకుని ఇంటికి చేరుకున్న దిలీప్‌కు ఆయన భార్య నిర్మల భోజనం వడ్డించింది. అయితే, భోజనం చేస్తున్న సమయంలో కూర రుచిగా లేదని దిలీప్ అనడంతో దంపతుల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన నిర్మల, వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తిని తెచ్చి భర్తపై దాడి చేసింది. దిలీప్ ఛాతీ ఎడమ భాగంలో బలంగా పొడవడంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలి తీవ్ర గాయాలపాలయ్యారు.
అనంతరం దిలీప్‌ను వెంటనే సమీపంలోని షాల్బీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న నరోడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితురాలు నిర్మలను అదుపులోకి తీసుకుని, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. క్షణికావేశంలో జరిగిన ఈ ఘోరంతో స్థానికంగా తీవ్ర విషాదం, దిగ్భ్రాంతి వ్యక్తమవుతున్నాయి.

