Last Updated:
Rupee vs Dollar: డాలర్ విలువ పెరిగితే విదేశీ చదువులు, ప్రయాణాలు, దిగుమతి వస్తువుల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అదే రూపాయి బలపడితే కొంత ఉపశమనం లభిస్తుంది. తాజాగా భారత కరెన్సీ డాలర్‌తో పోలిస్తే ఏడు నెలల గరిష్టానికి చేరుకుంది. ఒక్కరోజే 22 పైసలు పెరగడం మార్కెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ మార్పునకు కారణాలేంటి? సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది?
దీపావళి తర్వాత దేశీయ కరెన్సీకి మంచి రోజులు వచ్చినట్లుగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, విదేశీ పెట్టుబడుల రాక, ముడి చమురు ధరల తగ్గుదల రూపాయికి కొత్త బలాన్ని ఇచ్చాయి. దీంతో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఒక్కసారిగా పెరిగింది. సోమవారం (నవంబర్ 9) ట్రేడింగ్ ప్రారంభంలోనే 22 పైసలు బలపడిన రూపాయి.. గత ఏడు నెలల్లో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది.
సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 93.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. గత సెషన్లో ముగింపు విలువ 93.98గా ఉంది. దీంతో ప్రారంభంలోనే 22 పైసలు లాభపడింది. గత వారం కూడా రూపాయి 1 శాతానికి పైగా బలపడటం గమనార్హం. భారత ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు భారీగా రావడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
గత వారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత స్టాక్ మార్కెట్లలో 4 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. విదేశీ పెట్టుబడులు పెరగడం వల్ల దేశీయ మార్కెట్లలో డాలర్ల సరఫరాకు మద్దతు లభించింది. ఫలితంగా రూపాయి విలువ బలపడింది. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా లాభపడిన దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్లు గత వారం నష్టాలను చవిచూశాయి. దీంతో అక్కడి నుంచి కొంతమంది పెట్టుబడిదారులు నిధులను వెనక్కి తీసుకుని భారత మార్కెట్ల వైపు మళ్లించారు.
రూపాయికి మరో ప్రధాన సానుకూల అంశం ముడి చమురు ధరల పతనం. గత వారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు 20 శాతం తగ్గాయి. భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. ధరలు తగ్గితే చమురు కొనుగోళ్ల కోసం ఖర్చు చేసే డాలర్ల మొత్తం కూడా తగ్గుతుంది. దీంతో డాలర్లకు డిమాండ్ తగ్గి రూపాయిపై ఒత్తిడి కొంత తగ్గుతుంది.
అయితే మరోవైపు అమెరికా ఉద్యోగాల గణాంకాలు అంచనాలకు మించి నమోదవడంతో ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు పెరిగాయి. దీంతో సోమవారం చాలా ఆసియా కరెన్సీలు బలహీనపడ్డాయి. అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు డాలర్ విలువపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రూపాయి మరింత బలపడుతుందా లేదా అనేది విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ముడి చమురు ధరలు, డాలర్ ఇండెక్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ పరిణామాలను మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.

