Last Updated:
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు చేస్తున్న ఆందోళనల వేళ బీజేపీ అక్రమ వలసదారులపై వైఖరిని మరింత కఠినతరం చేసింది. చొరబాటుదారులను గుర్తించి, తొలగించి, వెనక్కి పంపాలంటూ సరికొత్త నినాదంతో అధికార పక్షం రాజకీయ దాడి మొదలుపెట్టింది.
దేశంలో అక్రమ వలసదారులపై అధికార భారతీయ జనతా పార్టీ తన పోరాట వైఖరిని మరోసారి గట్టిగా స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాలు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు తెలుపుతున్న సమయంలో బీజేపీ మూడు సూత్రాల నినాదాన్ని తెరపైకి తెచ్చింది. “గుర్తించండి.. తొలగించండి.. దేశం నుంచి పంపించేయండి” (డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్) అనే సందేశాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఒకే మాట.. ఒకే తీర్మానం అని పేర్కొంది.
దేశ ఓటర్ల జాబితాల్లో అక్రమ చొరబాటుదారులు పేర్లు నమోదు చేసుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదటి నుంచీ చెబుతున్న వాదనలకు ఈ నినాదం అద్దం పడుతోంది. నకిలీ ఓట్లను తొలగించి జాతీయ భద్రతను కాపాడటమే తమ ప్రభుత్వ సంకల్పమని బీజేపీ మరోసారి గట్టిగా తేల్చి చెప్పింది.
మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కసరత్తుపై కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ ప్రక్రియ ముసుగులో లక్షలాది మంది పేదలు, మైనార్టీల నిజమైన ఓట్లను తొలగిస్తున్నారని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ ఆందోళనలను ఉధృతం చేశాయి.
???????????????????? ????????????????????. ???????????? ????????????????????????????.
DETECT. DELETE. DEPORT. 🛡️🇮🇳 https://t.co/8TJYPrZLqf— BJP (@BJP4India) November 7, 2026
ఈ నిరసనలపై బీజేపీ అంతే దీటుగా ఎదురుదాడి చేస్తోంది. విపక్షాలు చేపట్టిన ర్యాలీలను రాహుల్ గాంధీ “ఘుస్పైఠియా బచావో యాత్ర” (చొరబాటుదారుల రక్షణ యాత్ర)గా హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా అభివర్ణించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అక్రమ వలసదారులకు కొమ్ముకాస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
ప్రస్తుతం బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఓటర్ల ప్రక్షాళన వివాదం కేంద్రంగా అధికార, విపక్షాల నడుమ రాజకీయం తారాస్థాయికి చేరింది. చట్టబద్ధమైన పౌరుల హక్కులను కాపాడుతూనే అక్రమ వలసదారులను దేశ సరిహద్దుల అవతలకు పంపే ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని బీజేపీ నేతలు పునరుద్ఘాటించారు.

