Last Updated:
బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించి, హీరోగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటుడు సుడిగాలి సుధీర్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘G.O.A.T’.
బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించి, హీరోగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటుడు సుడిగాలి సుధీర్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘G.O.A.T’. ‘Greatest Of All Times’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా చిత్రబృందం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నవంబర్ 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడంతో సినిమాకు మరింత ప్రచారం లభించినట్లయింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ను మరో కొత్త కోణంలో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా గురించి నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల మాట్లాడుతూ.. సుడిగాలి సుధీర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిదని తెలిపారు. ఆయన క్రేజ్‌కు తగిన కథను ఎంపిక చేసుకుని ఈ సినిమాను నిర్మించినట్లు చెప్పారు. ఇందులో సుధీర్ పోషించిన పాత్ర నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారు.
సాంకేతికంగా కూడా సినిమాను ఉన్నత ప్రమాణాలతో రూపొందించినట్లు నిర్మాత వెల్లడించారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉంటుందని, సుధీర్ కెరీర్లో ఈ చిత్రం మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి కమర్షియల్ అంశాలతో పాటు నేటి యువత ఆలోచించేలా చేసే ఓ మంచి సందేశం కూడా సినిమాలో ఉంటుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
‘G.O.A.T’లో సుడిగాలి సుధీర్, దివ్యభారతితో పాటు సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్, రాజేంద్రన్, ఆనంద్ రామరాజ్, చమ్మక్ చంద్ర, పమ్మీ సాయి, నవీన్ నేని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, నేపథ్య సంగీత బాధ్యతలను మణిశర్మ నిర్వహిస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సన్నీ కూరపాటి అదనపు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. విజయ్ ముక్తవరపు ఎడిటర్‌గా, రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సమైరా రెడ్డి.ఎన్ కో-ప్రొడ్యూసర్‌గా, ప్రసూన మండవ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.
మొత్తానికి సుడిగాలి సుధీర్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ప్రచారం పొందుతున్న ‘G.O.A.T’పై అంచనాలు పెరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్ ట్రైలర్ విడుదల చేయడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. నవంబర్ 12న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం సుధీర్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

