మరోవైపు, కొనుగోలు సమయంలోనే బీమా అందించే ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశ్రమ పరిశీలిస్తోంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర భాగస్వాముల ద్వారా ఈ సేవలను అందించవచ్చని కవర్‌ఫాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రేయాన్స్ విజయ్ తెలిపారు. అయితే ఈ బీమా ఉచితమా? ఎంత విలువకు కవరేజ్ ఉంటుంది? ఎంతకాలం అమల్లో ఉంటుంది? అనే విషయాలను తెలుసుకోవాలని సూచించారు. డిజిటల్ బంగారంపై కూడా ఆసక్తి పెరుగుతోందని జంప్ సీఈఓ సర్వజీత్ సింగ్ విర్క్ తెలిపారు. భారతీయ కుటుంబాల్లో బంగారానికి సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఆయన ప్రస్తావించిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం, 2026 సెప్టెంబర్‌లో దేశంలో డిజిటల్ బంగారం కొనుగోళ్లు రూ.2,590 కోట్లకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 83 శాతం పెరుగుదల. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కొనుగోళ్లు 76 శాతం వృద్ధితో 16.3 టన్నులకు చేరాయి. అయితే డిజిటల్ బంగారం కొనుగోలు చేసేవారు దాని ఖర్చులు, భద్రత, రక్షణ ఏర్పాట్లు, రిస్కుల గురించి తెలుసుకోవాలని విర్క్ సూచించారు.

