Last Updated:
2018లో వచ్చిన హుషారు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్టు కొట్టింది. అసలు కుర్రాళ్లకు ఈ సినిమా ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదు.
2018లో వచ్చిన హుషారు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్టు కొట్టింది. అసలు కుర్రాళ్లకు ఈ సినిమా ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఫ్రెండ్ షిప్, లవ్, లైఫ్‌లో సెటిల్ అవడం.. ఇలా యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌కు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తీ ఛీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలక రోల్ కూడా ప్లే చేస్తున్నాడు.
ఈ ఈవెంట్లో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. నేటి యువత పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మొదటి భాగంలో శ్రీహర్ష కొనుగంటి ప్రేక్షకులను ఎంతగా నవ్వించారో.. రెండో భాగంలోనూ వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలను చూపించనున్నారని చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా మారిందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూతపడటం, వాటిని ప్రైవేటు సంస్థలకు విక్రయించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆర్. నారాయణమూర్తి ప్రస్తావించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, పని చేసే హక్కు వంటి అంశాలు ప్రస్తుత పరిస్థితుల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయని అన్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువత ఒకవైపు నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే.. ఉద్యోగాలు దొరికినవారు మరోవైపు పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న యువత పరిస్థితి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కొన్ని సంస్థల్లో ఉద్యోగులతో నిర్ణీత సమయానికి మించి పని చేయిస్తున్నారని, వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం చేయడం తప్పు కాదు కానీ, పని పేరుతో వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి రాకూడదన్నది ఆయన మాటల్లోని భావం. జీవితం అంటే కేవలం ఉద్యోగం, జీతం, పని మాత్రమే కాదని.. మనకు నచ్చినట్లు స్వేచ్ఛగా బతకడం కూడా ముఖ్యమని ఆయన చెప్పారు. ఈ సందేశాన్ని ‘హుషారు 2’ ద్వారా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఐదుగురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. కరోనా సమయంలో ఆర్థికంగా నష్టపోయిన ఈ స్నేహితులు తమ జీవితాలను మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ ప్రయాణంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వారి ప్రయత్నాలు విజయవంతమయ్యాయా? అనూహ్యంగా ఎదురైన పరిస్థితులను ఎలా అధిగమించారు? అనే అంశాలతో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. స్నేహం, వినోదంతో పాటు యువత జీవితాల్లో ఎదురయ్యే వాస్తవ సమస్యలకు కూడా ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
మొదటి భాగానికి దర్శకత్వం వహించిన శ్రీహర్ష కొనుగంటి ఈ సీక్వెల్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ, ఆర్. నారాయణమూర్తి, దినేష్ తేజ్ తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. తాజాగా వచ్చిన టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మొత్తానికి, ‘హుషారు 2’ కేవలం స్నేహితుల సరదాలు, వినోదంతోనే కాకుండా.. నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం, పని ఒత్తిడి, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను దర్శకుడు ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ సీక్వెల్ మొదటి భాగం తరహాలోనే యువతకు కనెక్ట్ అవుతుందా? వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందిస్తుందా? అనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది.

