నెట్వర్క్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో మంగళవారం జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గంలో వాణిజ్య నౌకల రక్షణను అమెరికా కొనసాగిస్తుందని, అదే సమయంలో ఇరాన్‌పై “తీవ్రస్థాయి ఆర్థిక ఆంక్షలు/ఒత్తిడి” కొనసాగిస్తుందని తెలిపారు. ఇరాన్ తన వద్ద ఉన్న నిధులను ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వాడకుండా, ఉగ్రవాదాన్ని పోషించడానికి, క్షిపణులు, డ్రోన్లను తయారు చేసి వాణిజ్య నౌకలను కూల్చేయడానికి వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు.
“ఇది మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. కానీ ఈ దాడులను ఆపాల్సిన పూర్తి బాధ్యత ఇరాన్‌పైనే ఉంది. ప్రతి డాలర్, ప్రతి వనరును వారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి, వాణిజ్య నౌకలను ముంచే డ్రోన్లు, క్షిపణుల తయారీకే వాడుతున్నారు తప్ప ప్రజల బాగు కోసం కాదని మాకు తెలుసు. అందుకే వారిపై తీవ్ర ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తాం” అని రూబియో పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీకి చెందిన జలాంతర్గాములు (U-Boats) అనుసరించిన దుర్మార్గపు వ్యూహాలనే ఇరాన్ ఇప్పుడు ప్రయోగిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి దుయ్యబట్టారు. అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి వచ్చి ఈ దాడులను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.
“దురదృష్టవశాత్తూ ఇరాన్ ప్రస్తుతం ఒక దుశ్చర్యకు పాల్పడుతోంది. ప్రపంచమంతా దీని గురించే చర్చించాలి. యుద్ధంతో సంబంధం లేని నావికులను చంపేస్తామని, వాణిజ్య నౌకలను ముంచేస్తామని ఒక దేశం బాహాటంగా చెప్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. నాజీల యూ-బోట్ తరహా వ్యూహాలను ఇరాన్ అమలు చేస్తోంది. దీనిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాలి” అని ఆయన అన్నారు.
హోర్ముజ్ జలసంధిలో నిరంతరం జరుగుతున్న దాడుల ప్రభావంపై స్పందిస్తూ.. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ అక్కడ వాణిజ్య, ఇంధన రవాణా యుద్ధానికి ముందున్న స్థాయిలోనే కొనసాగుతోందని రూబియో తెలిపారు. ప్రస్తుతం 80 నుంచి 100 శాతం వరకు ట్రాఫిక్ యథావిధిగా సాగుతోందని చెప్పారు.
అమెరికా రక్షణ దళాలు ప్రతి రాత్రీ నౌకలకు రక్షణగా నిలుస్తున్నాయని, ఇరాన్ ప్రయోగిస్తున్న అత్యధిక శాతం డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ కొన్ని దాడులు లక్ష్యాన్ని తాకి నౌకలకు నష్టం కలిగిస్తున్నాయని, ప్రాణనష్టం కూడా జరుగుతోందని అంగీకరించారు.
“అమెరికా నిరంతరం పహారా కాస్తూ చాలావరకు డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. అయితే అప్పుడప్పుడు కొన్ని తప్పించుకుని నౌకలను ఢీకొడుతున్నాయి. చాలా నౌకలు ప్రయాణాన్ని కొనసాగించగలుగుతున్నప్పటికీ, ఇంజిన్ రూమ్‌లు దెబ్బతిని ప్రాణనష్టం జరుగుతోంది. వాణిజ్య నౌకల్లో పెద్ద సంఖ్యలో భారతీయ నావికులు విధులు నిర్వహిస్తుండటంతో, ఈ దాడుల్లో పలువురు భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం” అని రూబియో ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ వాణిజ్య నౌకల్లో భారత్‌కు చెందిన నిపుణులు, నావికులు భారీ సంఖ్యలో సేవలందిస్తుండటం, గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చే చమురు రవాణాపై దేశీయ ఇంధన భద్రత ఆధారపడి ఉన్న నేపథ్యంలో రూబియో వ్యాఖ్యలు భారత్‌కు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగియవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఉద్రిక్తతల తీవ్రత నేపథ్యంలో ఇరాన్‌తో ఏమైనా శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందా అని అడగ్గా.. టెహ్రాన్ పాలకులతో ఒప్పందానికి రావడం చాలా కష్టమని రూబియో స్పష్టం చేశారు.
“ఇరాన్ పాలకులతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా కష్టమైన పని. వారికి ఒప్పందాలు చేసుకోవడం తెలియదు. మత ఛాందసవాద ఆలోచనలతో నడిచే షియా మతగురువుల నియంత్రణలో ఆ దేశం ఉంది. అలాంటి వారితో ఏకాభిప్రాయానికి రావడం దాదాపు అసాధ్యం” అని రూబియో తేల్చిచెప్పారు. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తూనే, ఉగ్రవాద మూకలకు నిధులు మళ్లించకుండా ఇరాన్‌పై ఆర్థికపరమైన ఒత్తిడిని కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
