హరియాణాలోని ఫరీదాబాద్ అమృతా ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గౌతమ్ సింఘాల్ ఈ విషయంపై పలు సూచనలు చేశారు. కొంతమందికి గుండెకు సంబంధించిన అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ రోజువారీ జీవితంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని ఆయన తెలిపారు. అలాంటివారు ఒక్కసారిగా తీవ్రమైన వ్యాయామం చేయడం, తమ సామర్థ్యానికి మించి బరువులు ఎత్తడం వల్ల సమస్యలు బయటపడే అవకాశం ఉంటుందని వివరించారు.
వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. అయితే, వయసు, శారీరక సామర్థ్యం, ఆరోగ్య పరిస్థితులను బట్టి వ్యాయామం ఎంచుకోవాలి. 20 నుంచి 40 ఏళ్ల యువత చేసే వ్యాయామం, 50 ఏళ్ల వారు చేసే వ్యాయామం, 70 ఏళ్ల వృద్ధులు చేసే వ్యాయామం ఒకేలా ఉండకూడదు.
ఇతరులు ఎక్కువ బరువులు ఎత్తుతున్నారని లేదా కఠినమైన వ్యాయామాలు చేస్తున్నారని చూసి వారిని అనుకరించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రమంగా వ్యాయామ తీవ్రతను పెంచుకోవడం, శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం ముఖ్యం.
వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా స్పృహ కోల్పోవడానికి శరీరంలో నీటి శాతం తగ్గడం, రక్తపోటులో మార్పులు వంటి కారణాలు ఉండవచ్చు. అయితే, వెంట్రిక్యులర్ టాకీకార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటి తీవ్రమైన గుండె లయ సమస్యలు ఇందుకు కారణం కావచ్చు. ఇవి ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉంది.
అందుకే జిమ్లలో ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED) అందుబాటులో ఉండాలని, సిబ్బందికి సీపీఆర్ (CPR)పై అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా వ్యాయామం చేస్తూ స్పృహ కోల్పోతే వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించాలి.
వ్యాయామం సమయంలో కొద్దిగా చెమట పట్టడం, శ్వాస వేగంగా మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం సాధారణమే కావచ్చు. అయితే, కొన్ని లక్షణాలను సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలగడం, ఛాతీలో ఒత్తిడి లేదా నొప్పి అనిపించడం, అకస్మాత్తుగా తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం, అసాధారణంగా ఎక్కువ చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపి వైద్య సహాయం తీసుకోవాలి. ఛాతీ నొప్పి, తీవ్రమైన శ్వాస ఇబ్బంది లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే అత్యవసర వైద్య సేవలను సంప్రదించాలి.
భారతీయుల్లో చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్న నేపథ్యంలో జిమ్ ప్రారంభించే ముందు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయించుకోవడం మంచిదని డాక్టర్ గౌతమ్ సింఘాల్ సూచిస్తున్నారు. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయసులో వ్యాయామం ప్రారంభించేవారు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు, కొలెస్ట్రాల్ వంటి అంశాలను పరీక్షించుకోవాలి. వైద్యుడు సూచిస్తే ఈసీజీ, ఎకో వంటి పరీక్షలు కూడా చేయించుకోవచ్చు.
కుటుంబంలో చిన్న వయసులోనే ఆకస్మిక మరణాలు లేదా గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ అన్ని పరీక్షలు తప్పనిసరి కాకపోయినా, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడి సలహా తీసుకోవాలి.
వ్యాయామాన్ని భయపడాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతిలో, మన శరీర సామర్థ్యానికి అనుగుణంగా వ్యాయామం చేయడం, అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ప్రమాద సంకేతాలను నిర్లక్ష్యం చేయకపోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
