Last Updated:
తెలియని ప్రదేశానికి లేదంటే సిటీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్. ఇక అక్కడ ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే కొత్త స్టార్టప్ వచ్చేసింది.
కొత్త ఊరు వెళ్తున్నారా? అక్కడ ఎవరూ తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఒక తోడు ఉంటే ఎంత బాగుంటుందో కదా! సరిగ్గా ఇలాంటి ఆలోచనే విశాఖపట్నానికి చెందిన 24 ఏళ్ల యువకుడు యోగేంద్ర నాయుడు మదిలో మెదిలింది. కొత్త ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను స్థానికులతో అనుసంధానం చేసేలా ‘డూడో’ (Duedoh) అనే సరికొత్త స్టార్టప్‌ను ఆయన స్థాపించారు. మెరుగైన వైద్య సేవల కోసం పక్క ఊరు వెళ్లినా, ఒంటరిగా టూర్ వేయాలనుకున్నా, ఇంకేమైనా పని మీద వేరే సిటీకి వెళ్లాలనుకునే వారికి.. అండగా నిలిచేలా ఈ సంస్థ పనిచేయనుంది.
డూడో సంస్థ ఫౌండర్ యోగేంద్ర నాయుడు ఫోన్ కాల్ ద్వారా న్యూస్18 ప్రతినిధి మస్తాన్ వలీతో మాట్లాడారు. పలు అంశాలను వెల్లడించారు. మనకు ఏమాత్రం పరిచయం లేని నగరాలకు వెళ్లినప్పుడు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. బస చేయడానికి గదులు వెతకడం నుంచి స్థానికంగా తిరగడం దాకా ప్రతిదీ సవాల్‌గా మారుతుంది. ఈ సమస్యలకు చెక్ పెడుతూ ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం, సమన్వయం కోసం డూడో సంస్థ స్థానిక సహాయకులను ఏర్పాటు చేస్తుంది. వీరినే ‘డూడ్’ అని పిలుస్తారు. మనకు కావాల్సిన సహాయం, మార్గదర్శకత్వం కోసం ముందుగానే ఒక డూడ్‌ను బుక్ చేసుకునే అద్భుతమైన సదుపాయం ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
కస్టమర్ల నుంచి వస్తున్న విశేష స్పందనతో వచ్చే నెల అక్టోబర్ చివరి వారంలో ఈ స్టార్టప్ తమ సేవలను అధికారికంగా ప్రారంభించనుంది. తొలి విడతలో హైదరాబాద్, విశాఖపట్నం, గోవా నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. మీరు కూడా డూడ్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. లాంచింగ్‌కు ముందే రెండు వేల మంది కస్టమర్లు ఈ సేవల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం విశేషం. అంతేకాకుండా స్థానిక సహాయకులుగా, అంటే ‘డూడ్స్’గా పనిచేసేందుకు 300 మంది యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవడం ఈ సంస్థ క్రేజ్‌ను తెలియజేస్తోంది.
కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డూడో సంస్థ ప్రధానంగా నాలుగు రకాల ప్యాకేజీలను రూపొందించింది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా రూ.299 ప్రారంభ ధర నుంచి ప్రాథమిక ప్యాకేజీని అందిస్తున్నారు. డ్యూడ్ లైట్ (రూ.299 నుంచి), డ్యూడ్ ప్రో (రూ.499 నుంచి), డ్యూడ్ మ్యాక్స్ (రూ.999 నుంచి), డ్యూడ్ సపోర్ట్ (నిమిషానికి రూ.5) వంటి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్లాట్‌ఫారమ్‌లో బుక్ చేసుకునే సమయంలోనే కస్టమర్లకు ఎంత ఛార్జ్ పడుతుందో పూర్తిగా, పారదర్శకంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకపోవడంతో ప్రయాణికులు తమ బడ్జెట్‌కు సరిపోయే ప్యాకేజీని సులభంగా ఎంచుకోవచ్చు.

కేవలం రూ.50 వేల ప్రాథమిక పెట్టుబడితో యోగేంద్ర నాయుడు ఈ సంస్థను ప్రారంభించాడు. ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ కృత్రిమ మేధ (AI) సాధనాల కోసం ప్రతినెలా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు సంస్థ ఖర్చు చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపయోగపడే సాంకేతికతను రూపొందించడంలో వీరు సఫలమయ్యారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ వెనుక తొమ్మిది మంది సభ్యుల బృందం నిరంతరం శ్రమిస్తోంది. వీరిలో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మరో ఇద్దరు పార్ట్‌టైమ్‌గా తమ సేవలు అందిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వీరెవరికీ ప్రస్తుతం ఎలాంటి జీతాలు ఇవ్వడం లేదు. లాభాపేక్ష లేకుండా కేవలం ఒక గొప్ప ఆలోచనను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఈ బృందం అహర్నిశలు కష్టపడుతోంది. భవిష్యత్తులో ఈ ‘డూడో’ ప్లాట్‌ఫారమ్ ట్రావెల్ రంగంపై ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాల్సి ఉంది. కాగా ప్రస్తుతం వెబ్‌సైట్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో యాప్ కూడా అందుబాటులోకి రానుంది.

