పెన్షనర్లు లేవనెత్తిన అత్యంత ముఖ్యమైన డిమాండ్లలో ‘కనీస పెన్షన్’ పెంపు ప్రధానమైనది. ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి తీసుకున్న చివరి జీతంలో (Last Pay Drawn – LPD) కనీసం 67 శాతం లేదా సర్వీసులో చివరి 10 నెలల్లో పొందిన సగటు వేతనాన్ని బట్టి కనీస పెన్షన్‌ను పెంచాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా, వయోవృద్ధులైన పెన్షనర్ల వైద్య, జీవన అవసరాలను దృష్టిలో ఉంచుకుని వయస్సు ఆధారిత పెన్షన్ పెంపును ప్రతిపాదించారు. దీని ప్రకారం.. 65 ఏళ్ల వయసులో చివరి జీతంలో 70%, 70 ఏళ్లకు 75%, 75 ఏళ్లకు 80%, 80 ఏళ్లకు 85%, 85 ఏళ్లకు 90% చొప్పున పెన్షన్ ఇవ్వాలని.. వయసు 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే చివరిగా తీసుకున్న పూర్తి జీతాన్ని (100%) పెన్షన్‌గా చెల్లించాలని వారు ప్రతిపాదించారు. వీటితో పాటు ఉద్యోగులు మరికొన్ని కీలక అంశాలను కమిషన్ ముందు ఉంచారు. జీతాల పెంపును నిర్ణయించే ‘ఫిట్మెంట్ ఫ్యాక్టర్’ను తగిన విధంగా సవరించాలని, కరువు భృతి (DR) విధానాన్ని సమీక్షించి దానిని బేసిక్ పెన్షన్‌లో విలీనం చేయాలని కోరారు. అలాగే, కుటుంబ పెన్షన్ ప్రయోజనాలను మరింత విస్తృతం చేయాలని, గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా, పదవీ విరమణ చేసిన ఉద్యోగికి తన అభిరుచులు, అవసరాలను బట్టి పాత పెన్షన్ స్కీమ్ (OPS), జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS) లేదా కొత్తగా వచ్చిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS)లలో ఏదో ఒకదానిని ఎంచుకునే స్వేచ్ఛను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

