Last Updated:
వయసు 21 ఏళ్లు.. జర్మనీలో డ్రైవర్‌లెస్ రైళ్ల తయారీ కంపెనీకి ఓనర్. ఈ తెలుగోడి గురించి తెలుసుకోవాల్సిందే.
వయసు కేవలం 21 ఏళ్లు. తోటి యువకులు ఇంకా చదువులు, కెరీర్ అన్వేషణలో ఉన్న వయసులోనే ఏకంగా జర్మనీలో ఓ భారీ రైల్వే టెక్నాలజీ కంపెనీకి అధినేతగా ఎదిగాడు. విదేశీ గడ్డపై అత్యాధునిక రైళ్లను తయారు చేస్తూ ప్రపంచ దేశాల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అతనే వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన యువ సంచలనం హేమేంద్ర కుమార్. కలలో కూడా ఊహించని అద్భుతాలను సుసాధ్యం చేస్తూ జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కేంద్రంగా ‘జెబ్రోల్డ్ ఐహెచ్ఎల్’ (Zebrold IHL) అనే రైల్వే వాహన, సాంకేతిక తయారీ సంస్థను విజయవంతంగా నడుపుతున్నాడు. ఈ తెలుగోడి ప్రతిభ, అంకితభావం చూసి అగ్ర దేశాలకు చెందిన బడా కంపెనీలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
ఒక మీటింగ్‌లో న్యూస్18 ప్రతినిధి మస్తాన్ వలీతో హేమేంద్ర కుమార్ పలు అంశాలను వెల్లడించారు. ఫ్రాంక్ ఫర్ట్ లో ఏర్పాటైన ఈ కంపెనీ రైళ్లు, రైల్వే కోచ్‌లు, విడిభాగాలు, సిగ్నలింగ్ సిస్టమ్స్, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణంలో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తోంది. గంటకు ఏకంగా 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అత్యాధునిక హైస్పీడ్ రైళ్లతో పాటు భవిష్యత్ రవాణా అవసరాలకు తగ్గట్లుగా డ్రైవర్‌లెస్ రైళ్లను సైతం ఈ సంస్థ సొంతంగా అభివృద్ధి చేస్తోంది. నాణ్యమైన ఆటోమోటివ్ విడిభాగాలు చాలా తక్కువ ధరకే లభిస్తాయనే పక్కా ప్రణాళికతోనే హేమేంద్ర జర్మనీని తమ ప్రధాన తయారీ కేంద్రంగా ఎంచుకున్నాడు. అత్యాధునిక సాంకేతికతతో రైల్వే రంగంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతూ సత్తా చాటుతున్నాడు.

జర్మనీలోని ప్లాంట్‌లో రైళ్లను తయారు చేసి వాటిని భారీ కార్గో కంటైనర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఈ సంస్థ ఎగుమతి చేస్తుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నగరానికి సంబంధించిన ఒక రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనితో పాటు ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో కూడా రైల్వే సేవలను విస్తరించేలా జెబ్రోల్డ్ సంస్థ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ మార్కెట్లో తమ అత్యుత్తమ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తూ ఈ 21 ఏళ్ల కుర్రాడు ప్రపంచ పటంలో సగర్వంగా నిలబడ్డాడు.

రైల్వే డిజైన్ విభాగంలో హేమేంద్రకు గత రెండేళ్లుగా విశేషమైన అనుభవం ఉంది. సరిగ్గా 11 నెలల క్రితం జర్మనీలో కంపెనీని స్థాపించిన అతడు, నాలుగు నెలల కిందట వాణిజ్యపరమైన ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించాడు. ప్రధాన తయారీ యూనిట్ జర్మనీలో ఉన్నప్పటికీ, మన దేశంలోని ఐటీ హబ్స్ అయిన హైదరాబాద్, బెంగళూరు నగరాలతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు చోట్ల ఈ సంస్థ డిజైన్ సెంటర్లను కలిగి ఉంది. స్వదేశంలో ప్రతిభావంతులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మాతృభూమి రుణం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

రానున్న కాలంలో భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. లైట్ వెయిట్ డ్రైవర్‌లెస్ ట్రైన్స్‌పై పని చేస్తున్నట్లు వివరించారు. అత్యాధునిక జర్మన్ టెక్నాలజీని స్వరాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలన్నది అతని ప్రధాన లక్ష్యం. కడప జిల్లా నుంచి జర్మనీ స్థాయికి ఎదిగి చిన్న వయసులోనే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న హేమేంద్ర కుమార్ ప్రయాణం నేటి యువతకు కచ్చితంగా ఆదర్శప్రాయం.

