మద్దతు ధరలపై వివక్షకు వ్యతిరేకంగా రైతుల పోరుబాట
ప్రభ న్యూస్/ఖమ్మం:
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల ప్రకటనలో దక్షిణ భారతదేశం పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, పత్తి, మిర్చి పంటలకు తగిన మద్దతు ధర ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్షాభావం, సాగునీటి కొరతతో పాటు విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు వరికి ఎకరాకు రూ.30 వేలు, పత్తి, మిర్చికి ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు బీమా, పంటల బీమా పథకాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఇప్పటికే పత్తి దిగుబడులు ప్రారంభమైనందున సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాకు రూ.10 వేల చొప్పున పత్తిని కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎరువుల యాప్ రైతులకు ఇబ్బందిగా మారిందని, దానిని రద్దు చేసి మార్కెట్లో ఎరువులు స్వేచ్ఛగా లభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి సీతారామ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి గోదావరి జలాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం, కరువు పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాలనే డిమాండ్లతో ఈనెల 12న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు హేమంతరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు, నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

