Last Updated:
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రూ.169 కోట్లతో నిర్మించిన రిజర్వ్ బ్యాంక్ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ శిక్షణా కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ బ్యాంకింగ్ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.169 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన సరికొత్త డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ప్రధాని, ఈ నూతన కేంద్రం ఒడిశా రాష్ట్ర ప్రగతితో పాటు యావత్ దేశ ఆర్థిక రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తుందని కొనియాడారు. భువనేశ్వర్ నగరం నవ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని, ఈ ప్రాజెక్టుతో అనుసంధానమైన అధికారులను ఆయన అభినందించారు.
దేశంలో ఆర్థిక సమ్మిళితత్వాన్ని విస్తరించడంలో డిజిటల్ బ్యాంకింగ్ పోషిస్తున్న పాత్రను గుర్తుచేశారు. ఇదే సమయంలో గత కాంగ్రెస్ పాలనలోని బ్యాంకింగ్ విధానాలను మోదీ తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. గత విధానాలు కొద్దిమంది ప్రభావవంతమైన పెద్దలకు మాత్రమే మేలు చేశాయని దుయ్యబట్టారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాధారణ పేద, మధ్యతరగతి ప్రజలు ఒక చిన్న బ్యాంక్ ఖాతా తెరవాలన్నా గ్యారంటర్లను వెతుక్కోవాల్సి వచ్చేదని ప్రధాని గుర్తుచేశారు. అదే సమయంలో రాజకీయ పలుకుబడి ఉన్న కుబేరులకు మాత్రం కేవలం ఫోన్ కాల్స్ ద్వారా దిల్లీ పెద్దల సిఫార్సులతో వేల కోట్ల రూపాయల రుణాలు దక్కేవని ఆరోపించారు. ఈ అడ్డగోలు ‘ఫోన్ బ్యాంకింగ్’ వల్లే దేశంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) భారీగా పేరుకుపోయాయని మండిపడ్డారు.
#WATCH | Bhubaneswar, Odisha: At the inauguration of the Reserve Bank of India’s newly established Data Centre and Cybersecurity Training Institute, PM Narendra Modi says, “Today Bhubaneswar is giving a new institution to the new India. The inauguration of RBI’s data center and cyber security training institute here is an important occasion… I congratulate all those associated with this project.”
(Source: ANI/DD)— ANI (@ANI) October 25, 2026
ప్రస్తుతం డిజిటల్ బ్యాంకింగ్ విస్తరించడంతో దేశవ్యాప్తంగా సామాన్యులకు సైతం బ్యాంకింగ్ సేవలు సులభతరమయ్యాయని మోదీ స్పష్టం చేశారు. స్వయం ఉపాధి ప్రారంభించేందుకు నేడు చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, చేతివృత్తుల కళాకారులు తక్కువ వడ్డీతో బ్యాంక్ రుణాలు పొందుతున్నారని చెప్పారు. కోట్లాది మంది చేతుల్లో రూపే క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయని, అసంఘటిత రంగ కార్మికులు మొదటిసారిగా అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి అడుగుపెట్టారని వివరించారు.
ఒడిశాలో టెక్నాలజీ రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. డేటా సెంటర్లు, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతుండటంతో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అభివృద్ధి పథంలో ఒడిశా వేగంగా దూసుకుపోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

