పాలనలో సమన్వయ లోపం.. మంత్రులకు స్వేచ్ఛేది?
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిపై కూనంనేని విమర్శలు
– ఆర్థిక వ్యవహారాల కేంద్రీకరణ.. పాలనకు ప్రతిబంధకమా?
– ముఖ్యమంత్రి తీరు బాగున్నా.. ప్రాధాన్యాల ఎంపికలో పొరపాట్లెందుకు?
– హామీలు అమలు చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం
– ప్రజాస్వామ్యానికి ఓటే పునాది.. అర్హుల ఓట్ల తొలగింపుపై ఆందోళన
– అవినీతిపై చర్యలేవి? చట్టం అందరికీ సమానంగా అమలవుతోందా?
– యువతే ఉద్యమాలకు పునాది.. ప్రజా సమస్యలపై పోరాటం అవసరం
– మిత్రపక్షాల మధ్య సమన్వయ లోపం.. రాజకీయ విభేదాలకు కారణమేమిటి?
– ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గంలో మంత్రి పర్యటనలపై అభ్యంతరమెందుకు?
– ప్రశ్నించే గొంతులను అణచివేస్తే గత పరిణామాలే పునరావృతమవుతాయా?
– ప్రజలే అంతిమ నిర్ణేతలు.. ప్రజా తీర్పే కీలకం
ప్రభ న్యూస్ / ఖమ్మం:
తెలంగాణ రాష్ట్ర పాలనలో సమన్వయ లోపం కనిపిస్తోందని, మంత్రులకు ఆర్థికపరమైన స్వేచ్ఛ లేకపోవడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి బాగున్నప్పటికీ, కొన్ని అంశాల్లో ప్రాధాన్యాల ఎంపికలో పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 3న ఖమ్మంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ సమన్వయం వహించగా, జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఆర్థికపరమైన నిర్ణయాలు కేంద్రీకృతం కావడం, శాఖలకు అవసరమైన నిధుల వినియోగంలో స్వేచ్ఛ లేకపోవడం వల్ల మంత్రులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూనంనేని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న నిధులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలను అమలు చేసినప్పటికీ, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతోందని అభిప్రాయపడ్డారు. బొగ్గు అక్రమ రవాణా ఆరోపణల వంటి అంశాలపై వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం తీవ్రమైన తప్పిదమని అన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని, ఈ తరహా సమస్యలపై ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమాల్లో యువత కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే వారిని వివిధ ముద్రలు వేసి అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. దేశంలో సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బోఫోర్స్ కుంభకోణం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొన్న రాజకీయ పరిణామాలను ప్రస్తావించిన కూనంనేని, బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న భారీ అవినీతి ఆరోపణల విషయంలోనూ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వాల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ధరణి పోర్టల్ అంశం బీఆర్‌ఎస్ ఓటమికి ఒక కారణమైందని పేర్కొన్న ఆయన, భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. నిషేధిత జాబితాల్లో చోటుచేసుకునే చిన్నపాటి పొరపాట్లు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తాయని, అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్‌తో సీపీఐకు ఉన్న రాజకీయ అవగాహనను ప్రస్తావిస్తూ, ఆర్టీసీ ఎన్నికల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘాన్ని ఓడించేందుకు తమకు సమాచారం ఇవ్వకుండా ప్రయత్నాలు జరిగాయని కూనంనేని ఆరోపించారు. కమ్యూనిస్టు కార్మిక సంఘాలపై ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదా మద్దతు ఇవ్వడంపై పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు సంఘాలు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో తరచూ పర్యటించడంపై స్పందిస్తూ, ఇతర నియోజకవర్గాల్లో పర్యటించినట్లే ఇక్కడికి రావడంలో తప్పులేదన్నారు. అయితే, పదేపదే పర్యటిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యే పట్ల వ్యవహరించే తీరు సముచితంగా ఉండాలని సూచించారు. చివరికి ప్రజలే తమ ఓటు ద్వారా నిర్ణయం చెబుతారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సీపీఐ నైతిక మద్దతు కూడా ఒక కారణమని అన్నారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ కార్యక్రమాలకు మిత్రపక్షంగా సీపీఐ మద్దతు ఇస్తుందని, ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రశ్నిస్తుందని కూనంనేని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా నిరసనలను అణచివేయడం, ముందస్తు అరెస్టులకు పాల్పడటం వంటి చర్యలకు ప్రస్తుత ప్రభుత్వం కూడా పాల్పడితే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

