Last Updated:
నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి అలర్ట్. వాహనానికి ఉండే ఫాస్ట్‌ట్యాగ్‌ను మార్చడం చాలా సులభం అయింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో ‘వన్‌ట్యాగ్’ ఫాస్ట్‌ట్యాగ్ పోర్టబిలిటీ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు మరింత సౌలభ్యం అందించే ఉద్దేశంతో ఎన్‌హెచ్‌ఏఐ రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో ‘వన్‌ట్యాగ్’ అనే ఫాస్ట్‌ట్యాగ్ పోర్టబిలిటీ సర్వీస్‌ను తీసుకొచ్చిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కొత్త సదుపాయం ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు తమ వాహనానికి అతికించి ఉన్న పాత ట్యాగ్‌ను మార్చాల్సిన అవసరం లేకుండానే, ఇష్యూయర్ బ్యాంకును మార్చుకోవచ్చు. దీనివల్ల కొత్తగా ఫిజికల్ ట్యాగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్, ఫాస్ట్‌ట్యాగ్ లోకల్ పాస్, అత్యవసర సహాయం కోసం 1033 హెల్ప్‌లైన్ వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ‘వన్‌ట్యాగ్’ పోర్టబిలిటీ సర్వీస్ రావడం ద్వారా నేషనల్ హైవే యూజర్లకు అందుబాటులో ఉండే సేవలు మరింత పెరిగాయి.
రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ పోర్టబిలిటీ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు. ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు యాప్‌లోకి లాగిన్ అయి తమ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి అర్హతను చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రస్తుత ఇష్యూయర్ బ్యాంకు నుంచి యూజర్‌కు ఆరు అంకెల మొబైల్ వెరిఫికేషన్ కోడ్ అంటే ఎంవీసీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి ఆమోదం తెలిపిన తర్వాత, యూజర్ కొత్త ఇష్యూయర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. పోర్టబిలిటీ ప్రక్రియను పూర్తి చేయడానికి కొత్త ఇష్యూయర్ వద్ద కస్టమర్ వెరిఫికేషన్, వాలెట్ ఆన్‌బోర్డింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పోర్టబిలిటీ విజయవంతంగా పూర్తయిన తర్వాత, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌కు లింక్ అయి ఉన్న పాత ఫాస్ట్‌ట్యాగ్ ఐడీ అలాగే ఉంటుంది. దీనివల్ల యూజర్లు అదే ఫిజికల్ ట్యాగ్‌ను వేరే ఇష్యూయర్ బ్యాంకుతో వాడటం కొనసాగించవచ్చు.
పోర్టబిలిటీ పూర్తయిన తర్వాత, పాత ఇష్యూయర్ పాత ఫాస్ట్‌ట్యాగ్ వాలెట్‌ను క్లోజ్ చేస్తారు. తగిన సర్దుబాట్లు చేసిన తర్వాత అందులో మిగిలిన బ్యాలెన్స్ డబ్బులను రిఫండ్ చేస్తారు. అలాగే, ఒకసారి పోర్ట్ అయిన ఇష్యూయర్ మారిన ఫాస్ట్‌ట్యాగ్‌ను మళ్లీ మార్చాలంటే ఆరు నెలల కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాతే మరోసారి పోర్ట్ చేయడానికి వీలవుతుంది. ఈ ‘వన్‌ట్యాగ్’ విధానం ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్ మెరుగవుతుంది. పదే పదే కొత్త ట్యాగ్‌లు తయారు చేయాల్సిన అవసరం తగ్గడం వల్ల నిర్వహణ ఖర్చులు, డిస్పాచ్, రీఇష్యూ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా ‘వన్‌ట్యాగ్’ వల్ల ఇష్యూయర్లను మార్చుకునే ప్రయాణం సులభం అవుతుంది. కస్టమర్లకు నచ్చిన ఆప్షన్ ఎంచుకునే అవకాశం దొరుకుతుంది. ఇది మరింత మెరుగైన, సమర్థవంతమైన ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థకు సహాయపడుతుంది.
దేశంలో ఫాస్ట్‌ట్యాగ్ వాడకం 98 శాతానికి పైగా ఉంది. దాదాపు 13 కోట్ల మంది దీనిని వాడుతున్నారు. ఇది మన దేశంలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఈ ‘వన్‌ట్యాగ్’ రావడం వల్ల డిజిటల్ టోలింగ్ వ్యవస్థ మరింత బలపడుతుంది. నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి ఉన్న పాత ఫిజికల్ ట్యాగ్‌ను అలాగే ఉంచుకుంటూనే, మరింత సౌలభ్యాన్ని, ఎక్కువ వెసులుబాటును పొందడానికి ఇది సహాయపడుతుంది. మొత్తంగా చూస్తే, ఫాస్ట్‌ట్యాగ్ మార్చుకోవడానికి ఇకపై ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. కొత్త ట్యాగ్ తీసుకోవాల్సిన శ్రమ లేకుండా కేవలం మొబైల్ యాప్ ద్వారానే బ్యాంకును మార్చుకునే వెసులుబాటు రావడంతో హైవే ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. టోల్ ట్రిప్పులు మరింత సులభంగా మారుతాయి.

