Last Updated:
జేఎస్‌డబ్ల్యూ గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ కమర్షియల్ మొబిలిటీ రంగంలోకి ‘యాంప్‌స్టార్’ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఇది భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను తయారు చేస్తుంది.
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రీన్‌టెక్ లిమిటెడ్, ఎలక్ట్రిక్ కమర్షియల్ మొబిలిటీ రంగంలోకి అడుగుపెడుతూ ‘యాంప్‌స్టార్’ (AMPSTAR) అనే సరికొత్త బ్రాండ్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను డిజైన్ చేయడం, తయారు చేయడం, విక్రయించడం జరుగుతుంది. ఈ బ్రాండ్‌కు ‘యాంప్‌స్టార్: పవర్డ్ బై జేఎస్‌డబ్ల్యూ’ అనే ప్రత్యేక ఎండార్స్‌మెంట్ ఉంటుంది. కేవలం వాహనాలే కాకుండా ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆపరేటింగ్ సొల్యూషన్స్, ఫైనాన్సింగ్ ఆప్షన్స్, అమ్మకాల తర్వాత పూర్తి మద్దతును ఇది అందిస్తుంది. కస్టమర్లు 150 కిలోవాట్ల నుంచి 500 కిలోవాట్ల వరకు పవర్ కాన్ఫిగరేషన్లను ఎంచుకోవడంతో పాటు, నేరుగా కొనుగోలు చేయడం, లీజింగ్ లేదా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) వంటి వివిధ మోడళ్లను ఎంచుకునే సదుపాయం ఉంది.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న ఆరిక్ (AURIC) ప్రాంతంలో 90 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఈవీ తయారీ కేంద్రంలో ఇవి తయారవుతాయి. ఈ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 15,000 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు కావడం విశేషం. బస్సుల తయారీ కోసం దేశంలోనే మొట్టమొదటి ప్రీ-ట్రీట్‌మెంట్, ఎలక్ట్రో-డిపాజిషన్ ప్రక్రియను ఈ ప్లాంట్ కలిగి ఉంది. భారత్‌లో వాతావరణం, రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా డబుల్ కూలింగ్ బ్యాటరీ సిస్టమ్, మోనోకోక్ ఛాసిస్, స్వంత డ్రైవ్‌ట్రైన్ సాఫ్ట్‌వేర్‌తో వీటిని ఇంజినీరింగ్ చేశారు.
ఈ లాంచ్ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ, భారత్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో దేశ ప్రజలను, సరుకులను రవాణా చేయడం ద్వారా దేశ నిర్మాణంలో భాగమవుతున్నామని తెలిపారు. దేశ ప్రయాణ శైలిని మార్చడంలో యాంప్‌స్టార్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, దీనివల్ల శక్తి భద్రత చేకూరడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. పార్త్ జిందాల్ మాట్లాడుతూ, కస్టమర్ల ప్రయాణం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయి మొబిలిటీ పరిష్కారాన్ని రూపొందించామని తెలిపారు. యాంప్ అంటే విద్యుత్ ప్రవాహ ప్రమాణమని, స్టార్ అంటే ఆశయం అని ఆయన వివరించారు.

