ఆరోపణల రాజకీయాలతో ప్రజలకు న్యాయం ఎప్పుడు? ప్రజాస్వామ్యం ఎటువైపు?
ఖమ్మం, ప్రభ న్యూస్, అక్టోబర్ 5:
సోమవారం టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో తమ్మినేని మాట్లాడారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ సమన్వయకర్తగా వ్యవహరించగా, జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.
రాష్ట్రంలో అధికార, విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని, గౌరవప్రదమైన రాజకీయ విమర్శలకు బదులు బజారు భాష, నీచ పదజాలం వినిపించడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో భూ కబ్జాలు, ఆక్రమణలు, ఆస్తులు, అక్రమ సంపాదనకు సంబంధించిన ఆరోపణలతో రాజకీయ దృష్టిని పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ, వాస్తవంగా చర్యలు తీసుకునే విషయంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారనే ప్రశ్న ప్రజల ముందుందని, అధికారంలో ఉన్నప్పుడు భూముల వ్యవహారాలపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేని కాంగ్రెస్, కార్యాచరణకు బదులు ప్రకటనలకే పరిమితమవుతున్న బీఆర్‌ఎస్ వల్ల ప్రజలకు చివరకు ఒరిగిందేమిటని నిలదీశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్‌లో ప్రజల పాత్ర క్రమంగా తగ్గిపోతోందని, ఒకప్పుడు రిగ్గింగ్, ఓట్ల కొనుగోలు గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండగా ఇప్పుడు గెలిచిన ప్రజాప్రతినిధుల కొనుగోలు వరకు రాజకీయాలు దిగజారాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ, ఫలితాలపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పాలనపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నా సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొనే బదులు విమర్శకులపై దేశద్రోహుల ముద్ర వేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఎంపిక ప్రక్రియపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తమ్మినేని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని, సమాజంలో ప్రశ్నించే గొంతుకలను వివిధ ముద్రలతో అణచివేయడం సరికాదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2014లో సంక్షేమం, ఆర్థిక ప్రణాళికల పేరుతో ముందుకు వచ్చి 2024 నాటికి మతాన్ని రాజకీయ ఎజెండాగా మార్చుకుందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, అమెరికాతో సంబంధాల విషయంలోనూ ఆయన విమర్శలు చేశారు. దేశంలో అవినీతి వ్యవస్థీకృతమవుతోందని, దాని భారాన్ని చివరకు పేదలు, సామాన్య ప్రజలే మోయాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా విపక్షంపై ఆరోపణలు, రాజకీయ రాద్ధాంతంతో కాలం గడుపుతోందని, బీఆర్‌ఎస్ కూడా ప్రజా ఉద్యమానికి బదులు ప్రకటనలకే పరిమితమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్షాల ఐక్యతపై మాట్లాడుతూ, కేవలం మాటలతో ఐక్యత సాధ్యం కాదని, ముందుగా ఐక్య కార్యాచరణ అవసరమని, సీపీఐ, సీపీఎంల మధ్య ఉన్న కార్యక్రమపరమైన తేడాలను సరిచేసుకుంటేనే విస్తృత ఐక్యత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజలను కదిలించి నిరంతర ప్రజా ఉద్యమాలను నిర్మించడమే సీపీఎం లక్ష్యమని, ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు, ప్రజా సమస్యలు, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలపై వామపక్షాలు, కలిసి వచ్చే శక్తులతో ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌తో 2024లో పొత్తు విఫలమవడానికి పాలేరు కారణం కాదని, సరైన అవగాహన లేకపోవడం, కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించడమే కారణమని తమ్మినేని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికార కాంక్షతో వ్యవహరిస్తోందని, ఇండియా కూటమిలోని పార్టీలను సైతం రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సీపీఎం నాయకుడి హత్యకు సంబంధించిన అంశంపైనా స్పందిస్తూ, ఘటనకు బాధ్యులెవరో తేల్చి నిందితులను అరెస్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. చివరికి రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు, అధికార పోరాటాలు, వ్యక్తిగత విమర్శలకే పరిమితమైతే ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయని, ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చే పార్టీలు నిజంగా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్నాయా లేదా రాజకీయ స్వప్రయోజనాల కోసమే అధికారాన్ని వినియోగిస్తున్నాయా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని తమ్మినేని వ్యాఖ్యానించారు.

