సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ భిక్ష కాదని, ప్రజల పోరాట ఫలితమని వ్యాఖ్యానించారు. ఉద్యమ ఉప్పెనలో కొట్టుకుపోతామనే భయంతోనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు. రవు పరిస్థితుల్లో మూసీ సుందరీకరణ అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చివరి వంద రోజుల్లో మాయ చేస్తే సరిపోతుందనే ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. మూడేళ్ల క్రితం విడుదల చేసిన మేనిఫెస్టోను మోసాల చిట్టాగా మార్చేశారని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించిన ‘అభయహస్తం’ పథకం, నేడు ప్రజలకు ఏమీ ఇవ్వని ‘మొండిహస్తం’, ‘శూన్యహస్తం’గా మారిందని ఎద్దేవా చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. మామిడికుదురు మండలం నగరం సమీపంలోని తాడివారిమెరక వద్ద ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు డ్రిల్లింగ్ బావి నుంచి భారీ శబ్దంతో గ్యాస్ ఒక్కసారిగా వెలువడింది. గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో సమీప ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక సిమెంటింగ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఐదు గంటల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌తో భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్‌వోసీ జారీ చేయాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతితో పాటు, ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతుల విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సానుకూలంగా స్పందించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను ఏపీ తీరం వైపు కదులుతోంది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను నేటి సాయంత్రానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని ఎస్‌డీఎంఏ వెల్లడించింది. గత ఆరు గంటలుగా గంటకు 3 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతున్నట్లు అధికారులు తెలిపారు.నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120–130 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 145 కి.మీ వేగాన్ని తాకవచ్చని హెచ్చరించారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ కోసం తీవ్రంగా శ్రమించారు. షూటింగ్‌లో భాగంగా గడ్డకట్టే చల్లని నీటిలో రోజుకు ఆరు గంటల పాటు గడిపినట్లు దర్శకుడు అపూర్వ లఖియా వెల్లడించారు. తడిసిన దుస్తులతోనే భోజనం చేస్తూ చిత్రీకరణలో పాల్గొన్నారని తెలిపారు.
నటీనటులు చలిని భరించడం చూసి చిత్ర బృందం కూడా వణికిపోయిందని వెల్లడించారు
నటుడు చిరంజీవి కళాకారుల ముఖం, గొంతు, సృజనాత్మక కృషిని అనుమతి లేకుండా వినియోగించడాన్ని అరికట్టాలని కోరుతూ కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. డీప్‌ఫేక్‌లు, నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా జరుగుతున్న డిజిటల్ దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల హైదరాబాద్‌లో అమిత్‌షాను కలిసిన సందర్భంగా చిత్ర పరిశ్రమ సమస్యలను చిరంజీవి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను సంబంధిత హోం శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లాలని అమిత్‌షా సూచించారు. ప్రతిపాదిత చర్యలపై సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు.
మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి, ఇకపై చెన్నై సూపర్ కింగ్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు జట్టు ప్రకటించింది.
ఐపీఎల్‌లో 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు చేసిన ధోనీ, వికెట్‌కీపర్‌గా 158 క్యాచ్‌లు, 47 స్టంపింగ్స్ నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన ధోనీ, ఇక మెంటార్‌గా జట్టుకు సేవలందించనున్నాడు.
భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టులకు వీడ్కోలు పలకడం కోహ్లీ కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డాడు. ఎంతో ఫిట్‌గా ఉన్న కోహ్లీకి సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంకా రాణించే సత్తా ఉందని పేర్కొన్నాడు. ఈ నిర్ణయం పట్ల భవిష్యత్తులో కోహ్లీ పశ్చాత్తాపపడే అవకాశం ఉందని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.2025 మేలో విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
క్వాడ్ భాగస్వామ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కూటమిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. భవిష్యత్ సాంకేతికత అభివృద్ధి కోసం 85 మిలియన్ డాలర్లతో ప్రత్యేక ఏఐ యాక్సిలరేటర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని టఫ్ మ్యాన్‌గా అభివర్ణించారు. టఫ్ నెగోషియేటర్ అని, తనకంటే మెరుగైన నాయకుడిగా ట్రంప్ ప్రశంసించారు.
