రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను సులభతరం చేయడానికి 10 కిలోవాట్ల వరకు డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రూఫ్‌టాప్ సోలార్ అప్లికేషన్, నెట్ మీటరింగ్ ఫీజులను పూర్తిగా రద్దు చేశాయి. డిస్కమ్‌లకు ప్రోత్సాహకంగా ₹3,807.6 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు సుమారు ₹104 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా, 46 నగరాల్లో సిటీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ప్రారంభించగా, నాణ్యతను నిర్ధారించేందుకు 23 వేలకుపైగా థర్డ్ పార్టీ తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ భవనాల్లో కూడా రూఫ్‌టాప్ సోలార్ విస్తరణ వేగంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 41,542 భవనాలను సౌరశక్తికి అనువుగా గుర్తించగా, వాటిలో 25,255 భవనాలకు ఇప్పటికే సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు 3.20 లక్షల భవనాలను గుర్తించగా, వాటిలో 81,329 భవనాలకు సోలార్ వ్యవస్థలు అమలు చేశారు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1.06 లక్షల ప్రభుత్వ భవనాలు సౌరశక్తితో అనుసంధానమయ్యాయి. ప్రాజెక్టుల చెల్లింపులు సకాలంలో జరిగేలా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజంను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

