Last Updated:
నెలకు కేవలం రూ.1174 కడితే చాలు.. మీ కుటుంబానికి ఏకంగా రూ.కోటి గ్యారెంటీ!
కుటుంబ భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. మనం సంపాదించే ప్రతి రూపాయి పిల్లల చదువులు, ఇతర గృహ అవసరాల కోసమే ఖర్చు చేస్తుంటాం. కానీ మనం లేని సమయంలో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఎలా దక్కుతుంది? ఈ ప్రశ్నకు కచ్చితమైన పరిష్కారాన్ని చూపుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అత్యంత విశ్వసనీయమైన ఈ ప్రభుత్వ రంగ సంస్థ తమ కస్టమర్ల కోసం ఎస్బీఐ లైఫ్ ద్వారా ‘స్మార్ట్ షీల్డ్ ప్లస్’ పేరుతో ఒక అద్భుతమైన ప్లాన్‌ను తీసుకువచ్చింది. వరంగల్‌కు చెందిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ యుగేందర్ ఈ ఆకర్షణీయమైన పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా వెల్లడించారు.
ఇది పూర్తిగా వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ స్వచ్ఛమైన రిస్క్ జీవిత బీమా పథకం. కస్టమర్ల విభిన్న అవసరాలకు తగ్గట్లుగా ఇందులో ప్రధానంగా మూడు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది ‘లెవెల్ కవర్ బెనిఫిట్’. దీంట్లో ఎంచుకున్న హామీ మొత్తం స్థిరంగా కొనసాగుతుంది. రెండవది ‘పెరుగుతున్న కవర్ బెనిఫిట్’. భవిష్యత్తులో పెరిగే కుటుంబ బాధ్యతలకు అనుగుణంగా బీమా హామీ మొత్తం కూడా పెరుగుతూ వెళ్లడం దీని ప్రత్యేకత. మూడవది ‘ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్‌తో కూడిన లెవెల్ కవర్’. జీవితంలో ఎదురయ్యే దశలను బట్టి అదనపు కవర్ పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
ఈ ప్లాన్‌లో ‘బెటర్ హాఫ్ బెనిఫిట్’ అనే మరో అద్భుతమైన సదుపాయం కూడా ఉంది. నిబంధనల ప్రకారం, పాలసీదారుడు మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి కూడా ఈ ప్లాన్ ద్వారా రక్షణ లభిస్తుంది. భవిష్యత్ ప్రీమియంలన్నీ కూడా పూర్తిగా మాఫీ అవుతాయి. దీనికి తోడు అదనపు రక్షణ కోరుకునే వారు ఎస్బీఐ లైఫ్ ‘యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్’ను ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రమాదవశాత్తు మరణించినా, లేదా ప్రమాదం కారణంగా పాక్షిక లేక శాశ్వత వైకల్యం సంభవించినా ప్రత్యేక ప్రయోజనాలు దక్కుతాయి.
సాధారణంగా ఈ ప్లాన్‌లో చేరేందుకు కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ధారించారు. లెవెల్ కవర్, పెరుగుతున్న కవర్ ఆప్షన్లకు గరిష్ట వయస్సు 60 లేదా 65 సంవత్సరాల వరకు ఉంటుంది. ఫ్యూచర్ ప్రూఫింగ్ సదుపాయం కావాలంటే గరిష్ట వయస్సు 40 ఏళ్లు మాత్రమే ఉండాలి. ఇందులో కనీస హామీ మొత్తం రూ.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియంలను ఒకేసారి, ఏటా, ఆర్నెల్లకోసారి లేదా నెలవారీగా చెల్లించే వెసులుబాటు ఉంది. అయితే ఇది స్వచ్ఛమైన రిస్క్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కావడంతో, పాలసీ గడువు పూర్తయ్యే వరకు వ్యక్తి జీవించి ఉంటే ఎలాంటి పరిపక్వ ప్రయోజనం దక్కదు.
దీనిని ఒక ఉదాహరణ ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. 30 ఏళ్ల రోహన్ అనే వ్యక్తి రూ.25 లక్షల లెవెల్ కవర్ ఎంచుకున్నాడు అనుకుందాం. పాలసీ అమలులో ఉండగా రాము దురదృష్టవశాత్తు మరణిస్తే, నామినీకి రూ.25 లక్షల సంపూర్ణ హామీ మొత్తం వెంటనే చెల్లిస్తారు. నామినీ ఈ డబ్బు మొత్తాన్ని ఒకేసారి ఏకమొత్తంగా తీసుకోవచ్చు. లేదా వారి అవసరాలను బట్టి నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక వాయిదాల రూపంలో 5, 10, 15, 20 సంవత్సరాల వ్యవధిలో కూడా తీసుకునే అవకాశం ఎస్బీఐ కల్పిస్తోంది.
అలాగే రోహన్‌కు సంబంధించి మరో ఉదాహరణ చూద్దాం. పొగతాగే అలవాటు లేని రోహన్ రూ.కోటి బీమాతో 45 ఏళ్ల కాలపరిమితికి లెవెల్ కవర్ ఆప్షన్ ఎంచుకున్నాడు. దీనికి ఏడాదికి రూ.14,088 చొప్పున ప్రీమియం కట్టాలి. అనగా నెలకు దాదాపు రూ.1174 పడుతుంది. రోహన్ 12 ఏళ్లు ప్రీమియం (మొత్తం రూ.1,69,056) చెల్లించి దురదృష్టవశాత్తు మరణిస్తే, అప్పటికి కట్టిన డబ్బు తక్కువే అయినా రోహన్ కుటుంబానికి మాత్రం ఏకంగా రూ.కోటి బీమా పరిహారం అందుతుంది. మీకు సరిపోయే పూర్తి వివరాలకు సమీప ఎస్బీఐ లైఫ్ కార్యాలయాన్ని సంప్రదించి ఈ ప్రయోజనాలు పొందవచ్చు. కాగా పాలసీ తీసుకునే ముందు డాక్యుమెంట్లు అన్నింటీనీ పూర్తిగా చదివి అర్థం చేసుకొని పాలసీ కొనడం ఉత్తమం. లేదంటే క్లెయిమ్ సందర్భంలో ఇబ్బందులు రావచ్చు.
