Last Updated:
‘మా ఊరి పొలిమేర’ ఫ్రాంచెసీలో భాగంగా ఇప్పుడు పొలిమేర- 3 రాబోతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
చిన్న సినిమాగా ఓటీటీలో విడుదలై పెను సంచలనం సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ‘పొలిమేర 2’ కూడా భారీ రెస్పాన్స్ అందుకొని, ప్రేక్షకులను థ్రిల్ చేసింది. చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ఇప్పుడు (పొలిమేర- 3)మూడో భాగం రాబోతోంది. తాజాగా ఈ సినిమా సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసి అంచనాలను అమాంతం పెంచేసింది.
గత రెండు భాగాల్లో తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న సత్యం రాజేష్, బాలాదిత్య, సాయి కామాక్షి భాస్కర్ల తదితరులు ఈ మూడో భాగంలోనూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈసారి సినిమాను మరింత భారీ బడ్జెట్ తో, పెద్ద కాన్వాస్ పై తెరకెక్కిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. సౌత్ ఇండియా ‘యాక్షన్ కింగ్’ అర్జున్ (Action King Arjun) పొలిమేర 3లో ఓ పవర్ ఫుల్ పాత్రలో భాగం కావడమే. ఆయన ఎంట్రీతో ఈ సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు వంశీ నందిపాటి, భరత్ నారంగ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు, బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్.. ఈ మూడో భాగాన్ని మరింత ఉత్కంఠభరితంగా మలుస్తున్నారు.
తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. గ్లింప్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభస్వామి, లయకారుడైన శివుడి విగ్రహాలను చూపించడం ఆకట్టుకుంది. ఆ వెంటనే సత్యం రాజేష్ నగ్నంగా, ఒంటికి బూడిద రాసుకుని చేస్తున్న భయానకమైన క్షుద్ర పూజల దృశ్యాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇక చివర్లో యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ ఎంట్రీ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది. మొదటి రెండు భాగాల్లో కేవలం క్షుద్ర పూజలు, చేతబడులు చుట్టూ తిరిగిన కథకు.. ఈసారి దైవత్వాన్ని జోడిస్తూ (Devotional touch) డిఫరెంట్ యాంగిల్ లో చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

