Last Updated:
PM Modi: భారత్, కెనడాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా పూర్వస్థితికి చేరుకుంటున్నాయి.
ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA – Comprehensive Economic Partnership Agreement)పై చర్చలను వీలైనంత త్వరగా కొలిక్కి తేవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ పునరుద్ఘాటించారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఈ ఒప్పందంపై వేగంగా ముందడుగు వేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ మేరకు కెనడా ప్రధాని కార్యాలయం (పీఎంఓ) మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ, మార్క్ కార్నీ మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల్లో ఆర్థిక రంగం, రక్షణ, భద్రత, కృత్రిమ మేధ (AI), ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల (People-to-People ties) విస్తరణపై లోతైన చర్చలు జరిగాయని పేర్కొంది.
గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు బలోపేతమవుతుండటాన్ని ఇరువురు ప్రధానులు స్వాగతించారు. ఈ సానుకూల వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
2030 నాటికి పరస్పర వాణిజ్యాన్ని రెట్టింపు చేసేందుకు వీలుగా సీఈపీఏ (CEPA) ఒప్పందాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్ధూ నేతృత్వంలో ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ‘టీమ్ కెనడా ట్రేడ్ మిషన్’ను, అలాగే ఈ వారంలో భారత పర్యటనకు విచ్చేస్తున్న కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ పర్యటనను ఇరువురు నేతలు స్వాగతించారు. రాబోయే డిసెంబరు నెలలో ప్రధాని మోదీ కెనడాలో పర్యటించనున్న నేపథ్యంలో, నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని ఇరు దేశాల నేతలు అంగీకారానికి వచ్చారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, దాని ప్రభావంపై నేతలిద్దరూ చర్చించారు. ఇంధనం, వ్యవసాయ రంగాల్లో నమ్మకమైన భాగస్వామ్య దేశాల ఆవశ్యకతను నొక్కిచెప్పారు. గత వారం భారత్‌లో జాతీయ భద్రతా సలహాదారుల (NSA) స్థాయిలో విజయవంతంగా జరిగిన ద్వైపాక్షిక భద్రతా చర్చలను వారు ప్రస్తావించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు ప్రధాని మోదీ చేస్తున్న నాయకత్వ ప్రయత్నాలను మార్క్ కార్నీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇటీవల అక్టోబర్ 5 నుంచి 7 వరకు కెనడా పీఎంఓ సలహాదారు డేవిడ్ మారిసన్ భారత పర్యటనకు వచ్చి, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఉగ్రవాద నిరోధం, వ్యవస్థీకృత నేరాలు, చట్టాల అమలు తదితర అంశాలపై విస్తృత చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
ప్రధాని కార్నీతో జరిగిన సంభాషణ అత్యంత ఫలప్రదంగా, స్నేహపూర్వకంగా సాగిందని ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, టెక్నాలజీ, భద్రత, ప్రజా సంబంధాలలో ఖచ్చితమైన ఫలితాలు సాధించేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.
Had a warm and productive conversation with Prime Minister Mark Carney.
We agreed to build on the positive momentum in India-Canada ties and work towards concrete outcomes across key areas of our Strategic Partnership, including trade, energy, technology, security and people-to-people ties.Together, India and Canada are contributing towards a more stable and prosperous world.
@MarkJCarney
— Narendra Modi (@narendramodi) October 13, 2026
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రమేయం ఉందంటూ గతంలో కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో 2023లో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్ ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అయితే, మార్చిలో మార్క్ కార్నీ భారత పర్యటన అనంతరం ఇరు దేశాల దౌత్య సంబంధాలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఇరు దేశాల రాజధానుల్లో హైకమిషనర్ల పునరుద్ధరణ కూడా జరగడంతో సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరినట్లయింది.

