Last Updated:
Ownly Food Delivery App: స్విగ్గీ, జొమాటోకు పోటీగా ర్యాపిడోకు చెందిన ‘ఓన్లీ’ ఫుడ్ డెలివరీ యాప్ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. జీరో కమీషన్ మోడల్, పారదర్శకమైన ధరలు, ర్యాపిడో క్యాప్టెన్లతో డెలివరీ వంటి ప్రత్యేకతలతో సేవలు ప్రారంభించింది. బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో ఓన్లీ లాంచ్ కావడం విశేషం.
Ownly Food Delivery App: ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో ఇప్పటికే స్విగ్గీ, జొమాటో వంటి దిగ్గజ యాప్స్ ఉండగా.. ఇప్పుడు మరో కొత్త ప్లేయర్ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ర్యాపిడోకు చెందిన ‘ఓన్లీ’ ఫుడ్ డెలివరీ యాప్ తాజాగా హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో లాంచ్ అయిన ఓన్లీ.. ఇప్పుడు హైదరాబాద్‌ను తన రెండో మార్కెట్‌గా ఎంచుకుంది.
హైదరాబాద్‌లో బిర్యానీ, ఇరానీ చాయ్, రెస్టారెంట్లు, లేట్‌నైట్ ఫుడ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓన్లీ తన సేవలను నగరవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికే స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ఆధిపత్యం ఉన్న ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి ఓన్లీ ఎందుకు వచ్చింది? ఈ యాప్‌లో ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
జీరో కమీషన్.. రెస్టారెంట్లకు ఊరట..
ఓన్లీ ప్రధానంగా జీరో కమీషన్ మోడల్‌తో పనిచేయనుంది. అంటే ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగస్వామ్యమయ్యే రెస్టారెంట్ల నుంచి కమీషన్ తీసుకోకుండా పనిచేయడం దీని ప్రత్యేకత. దీంతో రెస్టారెంట్లు తమ ఆహార ధరలను మరింత అందుబాటులో ఉంచుకునే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.
కస్టమర్లకు కూడా పారదర్శకమైన ధరలు….
ఓన్లీ ప్రకారం.. కస్టమర్లు ఆహారం, డెలివరీకి సంబంధించిన ఖర్చులను మాత్రమే చెల్లిస్తారు. అదనపు ఛార్జీలు, దాచిన ఖర్చులు లేకుండా ధరలను పారదర్శకంగా ఉంచడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. అంటే ఆర్డర్ చేసే సమయంలో బిల్లులో ఏమేం ఛార్జీలు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకునే విధంగా యాప్‌ను రూపొందించినట్లు పేర్కొంది.
ర్యాపిడో క్యాప్టెన్లతో ఫుడ్ డెలివరీ…
ఓన్లీకి మరో కీలకమైన బలం ర్యాపిడో క్యాప్టెన్ నెట్‌వర్క్. ఇప్పటికే ర్యాపిడోలో పనిచేస్తున్న క్యాప్టెన్లు ఫుడ్ డెలివరీ ఆర్డర్లను కూడా డెలివరీ చేయనున్నారు. దీంతో క్యాప్టెన్లకు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయని కంపెనీ చెబుతోంది. హైదరాబాద్‌లో ఓన్లీ లాంచ్ సందర్భంగా ర్యాపిడో క్యాప్టెన్ల కోసం ప్రత్యేకంగా బిర్యానీ పార్టీని కూడా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్యాప్టెన్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో **నాని** కూడా పాల్గొని క్యాప్టెన్లతో ముచ్చటించారు.
బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో..
ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో ఓన్లీ సేవలు ప్రారంభమయ్యాయి. అక్కడి తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఓన్లీ.. ఫుడ్ డెలివరీ రంగంలో కొత్త విధానాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెస్టారెంట్లకు జీరో కమీషన్, కస్టమర్లకు ధరల్లో పారదర్శకత, క్యాప్టెన్లకు అదనపు సంపాదన అవకాశాలు అనే మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
అలాగే ర్యాపిడో యాప్ ద్వారా కూడా ఓన్లీ ఫుడ్ డెలివరీ సేవలను యాక్సెస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్‌లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాపిడోకు చెందిన ఓన్లీ ఎంట్రీతో నగర ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

