Last Updated:
Onion Price: మీకు తెలుసా? మార్కెట్లో కిలో ఉల్లి రూ.50 దాటుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొన్ని నగరాల్లో కిలో రూ.35కే ఉల్లిపాయలను విక్రయిస్తోంది. ధరలను అదుపులోకి తెచ్చేందుకు భారీ బఫర్ స్టాక్‌ను ఉపయోగిస్తూ ఇప్పటికే 17 నగరాల్లో సుమారు 4,000 టన్నుల ఉల్లిని వినియోగదారులకు అందించింది. మరికొన్ని ప్రాంతాలకు ‘కందా ఎక్స్‌ప్రెస్’ ద్వారా సరఫరా కొనసాగుతోంది. అక్టోబర్‌లో కొత్త ఖరీఫ్ పంట రాకతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సామాన్యుల కంట కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలను అరికట్టే లక్ష్యంతో చేపట్టిన రాయితీ అమ్మకాల కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ ప్రత్యేక సబ్సిడీ విక్రయాలు ప్రారంభమైన కేవలం పది రోజుల వ్యవధిలోనే దేశంలోని 17 ప్రధాన నగరాల్లో సుమారు 4,000 టన్నుల బఫర్ ఉల్లిపాయలను వినియోగదారులకు విక్రయించినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ఆదివారం వెల్లడించారు.

