Last Updated:
Mushroom Pulao: ఘుమఘుమలాడే మష్రూమ్ పులావ్ కుక్కర్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పుట్టగొడుగులు మెత్తబడకుండా జ్యూసీగా ఉంటూ, అన్నం పొడిపొడిగా రెస్టారెంట్ రుచితో రావాలంటే పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
Mushroom Pulao: శాకాహారులకు నాన్‌వెజ్ బిర్యానీ లేదా పలావ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా, అద్భుతమైన సువాసన, జ్యూసీ టెక్స్చర్తో ఏదైనా స్పెషల్ రైస్ తినాలనిపించినప్పుడు గుర్తొచ్చే అద్భుతమైన వంటకం ‘మష్రూమ్ పులావ్’ అని గృహిణి కల్పన వివరిస్తున్నారు. తాజా పుట్టగొడుగుల మృదుత్వం, బిర్యానీ దినుసుల ఘాటు కలగలిసిన ఈ పులావ్ లంచ్‌బాక్స్ మొదలుకుని వీకెండ్ స్పెషల్ డిన్నర్ వరకు అమృతంలా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే చాలామంది ఇంట్లో చేసేటప్పుడు మష్రూమ్స్ ఎక్కువగా నీరు ఊరి మెత్తబడిపోవడం లేదా అన్నం ముద్దగా మారిపోవడం జరుగుతుంటుందని తెలుపుతున్నారు. అలా కాకుండా పుట్టగొడుగు ముక్క లోపలి వరకు మసాలా పట్టి, అన్నం ప్రతి మెతుకు పొడిపొడిగా ఉంటూ పక్కా రెస్టారెంట్ స్థాయి రుచితో రావడానికి పాటించాల్సిన ఆ వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
మష్రూమ్స్ (పుట్టగొడుగులు): 200 గ్రాములు (శుభ్రం చేసి, ముక్కలుగా కోసినవి) బాస్మతి బియ్యం: 2 కప్పులు (కడిగి అరగంట నానబెట్టినవి) ఉల్లిపాయలు: 2 (నిలువుగా సన్నగా తరిగినవి) టమోటాలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి) పచ్చిమిరపకాయలు: 4 (నిలువుగా చీల్చినవి) అల్లం వెల్లుల్లి ముద్ద: 1 పెద్ద చెంచా కొత్తిమీర తరుగు: పావు కప్పు పుదీనా తరుగు: పావు కప్పు పసుపు: పావు చిన్న చెంచా కారం పొడి: 1 చిన్న చెంచా ధనియాల పొడి: 1 చిన్న చెంచా గరం మసాలా పొడి: అర చిన్న చెంచా నిమ్మరసం: 1 పెద్ద చెంచా నూనె: 2 పెద్ద చెంచాలు నెయ్యి: 1 పెద్ద చెంచా ఉప్పు: రుచికి సరిపడా నీళ్లు: 3 కప్పులు (బాస్మతి బియ్యం కొలత ప్రకారం)
హోల్ మసాలా దినుసులు: బిర్యానీ ఆకులు: 2 దాల్చిన చెక్క: 2 చిన్న ముక్కలు లవంగాలు: 4 యాలకులు: 3 షాజీరా: 1 చిన్న చెంచా మరాఠీ మొగ్గ: 1 జీడిపప్పు: 8-10 (ఐచ్ఛికం)
మొదట కుక్కర్లో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. అందులో హోల్ మసాలా దినుసులు (చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ), జీడిపప్పు వేసి దోరగా వేయించండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మంచి బంగారు రంగు వచ్చేవరకు వేపండి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు వేయించండి.
ఆ తర్వాత టమోటా ముక్కలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి టమోటాలు మెత్తబడేవరకు మగ్గనివ్వండి. టమోటా మగ్గిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సగం కొత్తిమీర, పుదీనా తరుగు వేసి మసాలాలను కలపండి. ఇప్పుడు శుభ్రం చేసి కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలా పెద్ద మంటపై 2 నిమిషాలు మాత్రమే వేపండి (ఎక్కువ సేపు వేపితే మష్రూమ్స్ నుంచి నీరు ఊరుతుంది).
ఆ తర్వాత కొలత ప్రకారం 3 కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసి నీటిని బాగా మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టి నీరు వార్చిన బాస్మతి బియ్యాన్ని వేసి నెమ్మదిగా కలపండి. పైనుంచి మిగిలిన కొత్తిమీర, పుదీనా తరుగు చల్లి కుక్కర్ మూతపెట్టండి. మీడియం మంటపై సరిగ్గా 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ కట్టేయండి.
ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూతతీసి, అన్నం గింజలు విరిగిపోకుండా అడుగు నుంచి నెమ్మదిగా కలపండి. ఎంతో సువాసనభరితమైన మష్రూమ్ పులావ్ సిద్ధం. ఉల్లిపాయ రైతా లేదా ఏదైనా కుర్మాతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది.

