Last Updated:
Murder: సినిమాల్లో నేరాలను దాచిపెట్టేందుకు ఉపయోగించే సరికొత్త పద్ధతులను చూసి కొందరు నిజజీవితంలో అమలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు.
బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో అత్యంత సంచలనం సృష్టించిన హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేర కథాంశంతో తెరకెక్కిన ప్రముఖ చిత్రం ‘దృశ్యం’ చూసి ప్రేరణ పొందిన ఓ యువకుడు, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు భారీ స్కెచ్ వేసి కన్నతండ్రినే అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అయితే, అతడు చేసిన చిన్న తప్పిదం చివరకు కటకటాలపాలు చేసింది.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం.. సమస్తిపూర్ జిల్లాకు చెందిన రఘువీర్ సాహ్ని (50)కి, ఆయన కుమారుడు శివశంకర్ (26)కు మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఓ భూమి విక్రయానికి సంబంధించి తండ్రీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో రఘువీర్ తన కుమారుడు శివశంకర్‌తో పాటు కోడలిని కూడా తీవ్రంగా దూషించాడు. దీంతో తీవ్ర అవమానభారంతో రగిలిపోయిన శివశంకర్, తన భార్యతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి నివాసముంటున్నప్పటికీ తండ్రిపై పగను పెంచుకున్నాడు. ఎలాగైనా తండ్రిని మట్టుబెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
హత్య చేసిన తర్వాత పోలీసుల నిఘా నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకునేందుకు నిందితుడు ‘దృశ్యం’ సినిమాను క్షుణ్ణంగా పరిశీలించాడు. పోలీసులకు తనపై ఎలాంటి అనుమానం రాకూడదని భావించి, సూరత్ నుంచి తన సెల్‌ఫోన్‌ను పూర్తిగా స్విచ్ఛాఫ్ చేసి బయలుదేరాడు. దాదాపు 3,000 కిలోమీటర్లు ప్రయాణించి బిహార్‌లోని పాట్నా సమీపంలోని పటోరీ మీదుగా అర్ధరాత్రి వేళ తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ఎవరి కంటా పడకుండా వెనుక వైపు నుంచి ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. అప్పటికే ఆరుబయట గాఢ నిద్రలో ఉన్న తండ్రి రఘువీర్‌పై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఆ వెంటనే మళ్లీ ఎవరికీ తెలియకుండా పటోరీ రైల్వేస్టేషన్ మీదుగా తిరిగి సూరత్‌కు పారిపోయాడు.
తండ్రి హత్యకు గురైనా కుమారుడు అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడంతో బంధువులు, పోలీసులకు అతడిపై తొలి అనుమానం మొదలైంది. అయితే నిందితుడిని పట్టుకోవడానికి ప్రధాన ఆధారంగా మారింది మాత్రం అతడు చేసిన ఒకే ఒక్క పొరపాటు. హత్య పూర్తి చేసుకుని పారిపోయే క్రమంలో పటోరీ రైల్వేస్టేషన్‌లో ఉన్నప్పుడు శివశంకర్ కాసేపు తన ఫోన్‌ను ఆన్ చేసి భార్యతో మాట్లాడాడు. ఆ తర్వాత వెంటనే మళ్లీ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. సరిగ్గా 36 గంటల అనంతరం అదే ఫోన్ లొకేషన్ సూరత్‌లో ఆన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో నిందితుడి ఫోన్ సంఘటనా స్థలానికి సమీపంలో ఉండటం, ఆ తర్వాత సూరత్‌లో ప్రత్యక్షం కావడం పోలీసులకు బలమైన క్లూగా మారింది. సూరత్ చేరుకున్న ప్రత్యేక పోలీసు బృందం శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తండ్రిని చంపేందుకు తాను వేసిన ‘దృశ్యం’ స్కెచ్‌ను పూసగుచ్చినట్లు ఒప్పుకున్నాడు.

