Last Updated:
‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో ‘జగతి మేడమ్’గా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటి జ్యోతి పూర్వజ్ ఇప్పుడు కిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ రూ. కోటి రూపాయల ఆఫర్ ప్రకటించారు.
‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో ‘జగతి మేడమ్’గా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటి జ్యోతి పూర్వజ్. టీవీ సీరియల్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వెండితెరపై మెయిన్ హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆమె లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’. సుకు పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన కూడా ఒక కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ చేశారు. అక్టోబర్ 30న ఈ చిత్రం థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రకటించిన బంపర్ ఆఫర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ట్విస్ట్ గెస్ చేస్తే ఏకంగా కోటి రూపాయల బహుమతి ఇస్తామని మేకర్స్ ప్రకటించడం విశేషం.
మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణ దశలో ఉంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కారణంగా సినిమా విడుదలలో దాదాపు ఏడాది పాటు జాప్యం జరిగింది. అయినప్పటికీ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే కాస్త సమయం తీసుకున్నామని దర్శకుడు సుకు పూర్వాజ్ తెలిపారు.
సీరియల్స్ లో నిండుగా చీర కట్టుకుని, పద్దతిగా కనిపించిన జ్యోతి పూర్వజ్, ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారు. టీజర్ లో ఆమెను టెర్రరిస్ట్, హౌస్ వైఫ్, స్పై, వ్యాంపైర్ వంటి విభిన్న గెటప్స్ లో చూపించి క్యూరియాసిటీ పెంచారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ.. “రెండేళ్ల క్రితం నవరాత్రుల సమయంలో దేవుడి ఆశీస్సులతో ఈ సినిమా ప్రారంభించాం. ఇప్పుడు మళ్లీ దసరాకు ట్రైలర్ లాంచ్ చేసుకున్నాం. బుల్లితెరపై నన్ను ఎంతగానో ఆదరించారు. కేవలం డబ్బు కోసం కాకుండా పూర్తి ప్యాషన్ తో చేసిన ఈ సై-ఫై ఫిక్షన్ సినిమాలోని నా నటన మిమ్మల్ని కచ్చితంగా మెప్పిస్తుందని నమ్ముతున్నాను” అని జ్యోతి తన ఆనందాన్ని పంచుకున్నారు.
దర్శకుడు సుకు పూర్వాజ్ ఈ సినిమా కథలోని మూడు విభిన్న లేయర్స్ గురించి చెబుతూ, ప్రేక్షకులకు ఒక అరుదైన ఛాలెంజ్ విసిరారు. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని, ఆ తర్వాత సెకండాఫ్ లో వచ్చే అసలు ట్విస్ట్ ను ఎవరూ ఊహించలేరని ఆయన అన్నారు. ఇంటర్వెల్ పడిన మొదటి 5 నిమిషాల్లోపు ఆ ట్విస్ట్ ఏంటో కచ్చితంగా గెస్ చేసి, వారు ఇచ్చే వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయాలని తెలిపారు. అలా కరెక్ట్ గా గెస్ చేసిన వారికి సినిమా సక్సెస్ మీట్ లో ఏకంగా రూ. కోటి ప్రైజ్ మనీ అందజేస్తామని ఆయన కాన్ఫిడెంట్ గా ప్రకటించారు. దీనికి సంబంధించిన రూ. కోటి ప్రైజ్ మనీ పోస్టర్ ను జ్యోతి పూర్వజ్ ఈవెంట్ లో ఆవిష్కరించారు.
విభిన్నమైన ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ పెంచుతున్న ‘కిల్లర్’ మూవీ, ఈ నెల 30న థియేటర్లలోకి వస్తోంది. అదే రోజున ‘ఆదర్శ కుటుంబం’ అనే మరో సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఇది పోటీ పడబోతోంది. మరి ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో, ఆ కోటి రూపాయల జాక్ పాట్ ఎవరు గెలుచుకుంటారో వేచి చూడాలి.

