Last Updated:
బుల్లితెర ప్రేక్షకులను తనదైన కామెడీ టైమింగ్, వినూత్న పంచులతో కడుపుబ్బా నవ్విస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘జబర్దస్త్’ నటుడు, దర్శకుడు డేగల బాబు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
బుల్లితెర ప్రేక్షకులను తనదైన కామెడీ టైమింగ్, వినూత్న పంచులతో కడుపుబ్బా నవ్విస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘జబర్దస్త్’ నటుడు, దర్శకుడు డేగల బాబు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అమూల్య అనే యువతితో శుక్రవారం ఆయన వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బాబు స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ కొత్త జంట ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
‘జబర్దస్త్’ కామెడీ షోలో సాధారణ కంటెస్టెంట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన డేగల బాబు, తనదైన ప్రాసలు, సమయస్ఫూర్తితో అనతికాలంలోనే ప్రముఖ కమెడియన్‌గా ఎదిగారు. కేవలం నటుడిగానే కాకుండా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి పాపులర్ షోలలో అలరిస్తూనే, వందలాది స్కిట్లకు రచయితగా పనిచేసి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఇటీవల ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టి, ఓటీటీ వేదికగా మంచి విజయాన్ని అందుకున్నారు. కెరీర్‌లో పూర్తిగా స్థిరపడి, దర్శకుడిగా తొలి హిట్ అందుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఇన్నాళ్లూ వేచి చూసిన బాబు.. తన లక్ష్యాన్ని నెరవేర్చుకుని ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఇక వధువు అమూల్య విషయానికి వస్తే.. ఆమె బి.ఫార్మసీ పూర్తి చేసి, గతంలో పలు ప్రముఖ తెలుగు న్యూస్ ఛానళ్లలో న్యూస్ యాంకర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆపై గాఢమైన ప్రేమగా మారింది. డేగల బాబు కెరీర్ ఎదుగుదలలో అమూల్య అందించిన ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకమని సన్నిహితులు చెబుతున్నారు.
డేగల బాబు వివాహ వేడుకకు బుల్లితెర, జబర్దస్త్ తారలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. సునీత, టేస్టీ తేజ, జిత్తు, సందీప్, పంచ్ ప్రసాద్, నూకరాజు తదితరులు వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అటు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, నెటిజన్లు కూడా డేగల బాబు, అమూల్య జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

