వడ్డీ ఎలా లెక్కిస్తారు?
పన్ను బకాయిపై వడ్డీని మొత్తం ఆదాయంపై కాకుండా, అడ్వాన్స్ టాక్స్, TDS, TCS, విదేశీ పన్ను మినహాయింపులు (Foreign Tax Relief) వంటి వాటిని మినహాయించిన తర్వాత మిగిలిన నికర పన్ను మొత్తంపై మాత్రమే లెక్కిస్తారు. అందువల్ల ఇప్పటికే TDS లేదా అడ్వాన్స్ టాక్స్ ద్వారా మొత్తం పన్ను చెల్లించిన వారికి, రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేసినా సాధారణంగా సెక్షన్ 234A కింద వడ్డీ ఉండదు. అయితే ఆలస్య ఫైలింగ్ ఫీజు మాత్రం వర్తించవచ్చు.
ఆలస్యంగా ITR దాఖలు చేస్తే ఎంత జరిమానా?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం, గడువు తర్వాత ITR దాఖలు చేసిన వారికి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ జరిమానా వ్యక్తి మొత్తం వార్షిక ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించి ఉంటే, గరిష్టంగా రూ.5,000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే, గరిష్ట జరిమానా రూ.1,000 మాత్రమే ఉంటుంది. ఒకవేళ పన్ను బకాయి కూడా ఉంటే, ఈ ఆలస్య రుసుముతో పాటు సెక్షన్ 234A కింద వడ్డీ కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

