Last Updated:
ITR Filing 2026: దేశంలో కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం, 2025’ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసారి ITR ఏ చట్టం ప్రకారం దాఖలు చేయాలనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే ప్రస్తుతం ఫైల్ చేస్తున్న AY 2026-27 రిటర్న్‌లకు కొత్త చట్టం కాదు.. పాత 1961 ఆదాయపు పన్ను చట్టమే వర్తిస్తుంది. ఎందుకు ఇలా? రెండు ITRలు దాఖలు చేయాల్సి ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.
ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం, 2025’ (Income Tax Act, 2025) అమల్లోకి వచ్చింది. దీంతో దాదాపు ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘ఆదాయపు పన్ను చట్టం, 1961’ స్థానాన్ని కొత్త చట్టం భర్తీ చేసింది. అయితే ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేస్తున్న పన్ను చెల్లింపుదారుల్లో ఒక సందేహం ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రిటర్న్ దాఖలు చేస్తున్నందున, ఈసారి కూడా కొత్త చట్టం ప్రకారమే ITR ఫైల్ చేయాలా? లేక పాత చట్టం ప్రకారమే కొనసాగాలా? అనే ప్రశ్న చాలా మందిని అయోమయానికి గురిచేస్తోంది.
మనీకంట్రోల్ వెల్లడించిన కథనం ప్రకారం.. ప్రస్తుతం దాఖలు చేస్తున్న అసెస్మెంట్ ఇయర్ (AY) 2026-27 ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఆర్థిక సంవత్సరం (FY) 2025-26లో సంపాదించిన ఆదాయానికి సంబంధించినవి. ఆ ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2026తో ముగిసిపోయింది, అంటే కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రాకముందే ఆ ఆదాయం సంపాదించబడింది. అందువల్ల ఈసారి ITR దాఖలు, ఆదాయం లెక్కింపు, పన్ను బాధ్యత, మినహాయింపులు (Deductions & Exemptions), పన్ను రేట్లు వంటి అన్ని అంశాలు 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారమే కొనసాగుతాయి.
చాలామంది పన్ను చెల్లింపుదారులు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏప్రిల్ 1, 2026 తర్వాత రిటర్న్ దాఖలు చేస్తున్నందున, ఆటోమేటిక్‌గా కొత్త చట్టం వర్తిస్తుందని భావిస్తున్నారు. కానీ ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం రిటర్న్ దాఖలు చేసిన తేదీ ఆధారంగా కాదు, ఆదాయం ఏ కాలంలో సంపాదించారనే దానిపై ఏ చట్టం వర్తిస్తుందో నిర్ణయిస్తారు. అంటే, ప్రస్తుతం దాఖలు చేస్తున్న రిటర్న్‌లు FY 2025-26కు సంబంధించినవి కాబట్టి, అవి పూర్తిగా 1961 చట్టం పరిధిలోనే ఉంటాయి. కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీలు, ఆదాయం, మినహాయింపులు అన్నీ పాత నిబంధనల ప్రకారమే పరిశీలిస్తారు.
బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ కోశాధికారి కింజల్ భూటా తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి మాత్రమే అమల్లోకి వచ్చింది. అందువల్ల AY 2026-27కు సంబంధించిన ITRలపై ఈ చట్టం ప్రభావం ఉండదు. ప్రస్తుతం దాఖలు చేస్తున్న రిటర్న్లన్నీ 1961 చట్టం ప్రకారమే సమర్పించాలి. అలాగే కొత్త చట్టంలో ప్రవేశపెట్టిన ‘టాక్స్ ఇయర్’ (Tax Year) భావనతో పాటు కొత్త నిబంధనలు అన్నీ 2026-27 పన్ను సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై, అంటే 2027లో దాఖలు చేసే రిటర్న్‌ల నుంచే అమల్లోకి వస్తాయని ఆయన వివరించారు.
వకొత్త చట్టం అమల్లోకి రావడంతో మరో సందేహం కూడా చాలామందిలో ఉంది. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం వచ్చినందున, ఈ ఏడాది రెండు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సి వస్తుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. దీనికి సమాధానం ‘లేదు’. పన్ను చెల్లింపుదారులు ఈ ఏడాది కేవలం ఒకే ITR దాఖలు చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం సమర్పిస్తున్న రిటర్న్ FY 2025-26 ఆదాయానికి సంబంధించినది కాబట్టి అది 1961 చట్టం ప్రకారమే ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం ప్రత్యేకంగా మరో ITR సమర్పించాల్సిన అవసరం లేదు.
టాక్స్‌మాన్ (Taxmann) వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆయన ప్రకారం, ఆదాయపు పన్ను చట్టం, 2025 అమల్లోకి వచ్చిందనే కారణంతో రెండు రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. FY 2025-26కు సంబంధించిన ITRను 1961 చట్టం ప్రకారమే సమర్పించాలి. అనంతరం 2026-27 పన్ను సంవత్సరానికి సంబంధించిన మొదటి ITR మాత్రమే కొత్త చట్టం ప్రకారం, ఆ పన్ను సంవత్సరం పూర్తయిన తర్వాత నిర్ణయించిన గడువులోపు దాఖలు చేయాలి. అంటే రెండు చట్టాలు రెండు వేర్వేరు ఆదాయ కాలాలకు వర్తిస్తాయి. అందువల్ల ఒకే ఆదాయానికి రెండు రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఉండదు.
కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం మొదటి రిటర్న్ 2026-27 పన్ను సంవత్సరంలో (Tax Year) సంపాదించిన ఆదాయానికి సంబంధించినదిగా ఉంటుంది. ఈ పన్ను సంవత్సరం ముగిసిన తర్వాత, కొత్త చట్టంలో పేర్కొన్న నిబంధనలు, గడువు తేదీల ప్రకారం పన్ను చెల్లింపుదారులు తమ మొదటి ITRను దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం జరుగుతున్న ITR ఫైలింగ్ సీజన్‌పై కొత్త చట్టం ఎలాంటి ప్రభావం చూపదు. పన్ను చెల్లింపుదారులు AY 2026-27 కోసం విడుదల చేసిన ITR ఫారమ్‌లనే ఉపయోగించాలి. అలాగే 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను లెక్కింపు, వర్తించే మినహాయింపులు, పన్ను రేట్లు అన్నింటినీ అనుసరించి రిటర్న్ దాఖలు చేయాలి.
Hyderabad,Telangana

