భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రల వివరాలు
IRCTC అందిస్తున్న 8 ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రల్లో భాగంగా మొదటిగా అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర (బైద్యనాథ్ ధామ్తో) SCZBG70 ప్యాకేజీ డిసెంబర్ 5 నుంచి 14, 2026 వరకు 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ యాత్ర ప్రారంభ ధర రూ.17,000గా నిర్ణయించారు. అనంతరం ఉజ్జయిని-ద్వారక-సోమనాథ్-భీమాశంకర్ యాత్ర (SCZBG71) డిసెంబర్ 17 నుంచి 27, 2026 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.18,000.
ఉజ్జయిని-ద్వారక-సోమనాథ్-భీమాశంకర్ యాత్ర SCZBG73 ప్యాకేజీ ఫిబ్రవరి 2 నుంచి 12, 2027 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ యాత్ర ప్రారంభ ధర రూ.18,200. దివ్య దక్షిణ యాత్ర (అరుణాచలంతో) SCZBG74 ప్యాకేజీ ఫిబ్రవరి 18 నుంచి 26, 2027 వరకు 9 రోజుల పాటు కొనసాగనుంది. దీని ప్రారంభ ధర రూ.15,800.
అదేవిధంగా అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర (బైద్యనాథ్ ధామ్తో) SCZBG75 ప్యాకేజీ మార్చి 10 నుంచి 19, 2027 వరకు 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. దీని ప్రారంభ ధర రూ.17,000. చివరిగా ఉజ్జయిని-ద్వారక-సోమనాథ్-భీమాశంకర్ యాత్ర SCZBG76 ప్యాకేజీ మార్చి 23 నుంచి ఏప్రిల్ 2, 2027 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. ఈ యాత్ర ప్రారంభ ధర రూ.18,200గా నిర్ణయించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన
ఈ యాత్రల్లో భాగంగా దేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే అవకాశం యాత్రికులకు కల్పించనున్నారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ద్వారకలోని నాగేశ్వర్, సోమనాథ్, పుణెలోని భీమాశంకర్, నాసిక్‌లోని త్రయంబకేశ్వర్, ఛత్రపతి సంభాజీనగర్‌లోని గ్రిష్ణేశ్వర్ వంటి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
యాత్రికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు IRCTC ప్యాకేజీలో భాగంగా పలు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో సౌకర్యవంతమైన రైలు ప్రయాణంతో పాటు పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఏసీ బస్సుల ద్వారా రవాణా, హోటల్ వసతి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, ప్రయాణ సమయంలో తాగునీటి సౌకర్యం ఉంటాయి. అంతేకాకుండా అనుభవజ్ఞులైన టూర్ ఎస్కార్ట్ సేవలు, ప్రయాణ బీమా సౌకర్యం, రైల్వే స్టేషన్ల నుంచి ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు రవాణా సదుపాయాలను కూడా అందించనున్నారు. ప్రతి కోచ్‌కు సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయడంతో పాటు రైలులో సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నారు.
హైదరాబాద్ నుంచి 5 ప్రత్యేక దేశీయ విమాన పర్యాటక ప్యాకేజీలు
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రలతో పాటు విమాన ప్రయాణం ద్వారా దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు IRCTC హైదరాబాద్ నుంచి 5 ప్రత్యేక దేశీయ విమాన పర్యాటక ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో బెంగాల్ అందాలు (Beauty of Bengal) ప్యాకేజీ ధర రూ.42,010 కాగా, రాజస్థాన్ స్వర్ణ ఇసుకలు (Golden Sands of Rajasthan) ప్యాకేజీ ధర రూ.44,900గా ఉంది. సాంస్కృతిక కేరళం (Cultural Keralam) ప్యాకేజీని రూ.43,000కు, దివ్య కర్ణాటక (Divine Karnataka) ప్యాకేజీని రూ.41,300కు, దక్షిణ భారత దేవాలయ యాత్ర (South India Temple Run) ప్యాకేజీని రూ.44,300కు అందిస్తున్నారు.
ఈ ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రలు, దేశీయ విమాన పర్యాటక ప్యాకేజీల ద్వారా భక్తులు, పర్యాటకులు దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సౌకర్యవంతంగా సందర్శించవచ్చని IRCTC అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా IRCTC టూరిజం మానిటర్ నరేష్ బాబు ఓర్సు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఈ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను సద్వినియోగం చేసుకోవాలని, సీట్ల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు, ఆన్లైన్ బుకింగ్ కోసం www.irctctourism.com వెబ్సైట్ చూడొచ్చు. 970136701, 9281030711, 9281495845 నెంబర్లకు కాల్ లేదా వాట్సాప్ చేయొచ్చు.
