Last Updated:
DSP Bheemreddy: ఒక అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే.. ఒక్క రోజులో అవ్వదు. కొన్నేళ్లు పడుతుంది. మరి అన్నేళ్లలో ఎందుకు డీఎస్పీ భీమ్‌రెడ్డిని పట్టుకోలేదు? వెయ్యి కోట్లకు పైగా అక్రమాస్తులు కూడేసే వరకూ.. ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇన్నేళ్లుగా ఆయన్ని కాపాడుతున్నదెవరు? ఎవరెవరి అండతో ఇంతలా కూడబెట్టారు?
ఇండియాలో అవినీతి అనకొండలకు లెక్కలేదు. ఎప్పటికప్పుడు ఒకర్ని మించిన వారు మరొకరు బయటకు వస్తున్నారు. డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి విషయంలో అదే జరిగింది. ఆయన వెయ్యి కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారంటే.. ఎంతమందిని దోచుకొని ఉండాలి? ఎంతమంది జీవితాల్ని నాశనం చేసి ఉండాలి? ఒక డీఎస్పీ స్థాయి అధికారి ఇంతలా అవినీతికి పాల్పడుతుంటే.. మరి ఇతర అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? వెయ్యి కోట్లు పోగెయ్యడమంటే మాటలా? ఎవరి అండదండలూ లేకుండా ఇలా చెయ్యడం కుదురుతుందా? ఏసీబీ తనిఖీల్లో ఏం తేలింది?
అక్రమాస్తుల చిట్టా:
హైదరాబాద్‌లో విల్లా సహా భీమ్‌రెడ్డికి సంబంధించిన 16 ప్రాంతాల్లో దాడులు చేసినప్పుడు.. ఏసీబీ అధికారులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. 2 కేజీల బంగారం, 20 కేజీల వెండి, రూ.3.60 లక్షల డబ్బు, బినామీ ఇంట్లో మరో రూ.40 లక్షలు, అదనంగా బ్యాంకుల్లో రూ.19.91 లక్షలు డిపాజిట్లను ఏసీబీ కనిపెట్టింది. ఇవన్నీ వెయ్యి కోట్లు అవ్వవు. కానీ భీమ్‌రెడ్డి.. ఎక్కువగా అక్రమ డబ్బుతో పదుల సంఖ్యలో ఇళ్లు, స్థలాలు కొన్నాడు. అందువల్ల వాటిని లెక్కిస్తే.. వెయ్యి కోట్లకు పైగా అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు తేలుతోంది.
భీమ్‌రెడ్డి.. తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (TPCS)లో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఈయన ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో.. ఏసీబీ దాడులు చేసింది. తర్వాత కేసు రాసి, అరెస్టు చేసింది. ఏసీబీ అధికారుల ప్రకారం అక్రమాస్తులు రూ.300 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తున్నా.. ఇళ్లు, భూముల మార్కెట్ విలువను బట్టీ చూస్తే.. వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. కొన్ని కమర్షియల్ భవనాల్లో కూడా ఈయన పెట్టుబడులు పెట్టారనీ, బినామీల దగ్గర డబ్బు దాచారని తెలిసింది.
1995లో ఎస్సైగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన భీమ్‌రెడ్డి.. 2026 వరకూ అంటే.. 30 ఏళ్లలో ఇంత అవినీతిని పోగేశారు. అక్రమాస్తుల్లో టెలికాం నగరలో ప్లస్ 2 భవనం, పెంట్ హౌస్, మరో ప్లాట్, ఇబ్రహీంబాగ్‌లో వెస్సెల్లా మెకోస్లో విల్లా, మణికొండలో 1,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, జీ ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో 500 గజాల వాటా, గచ్చిబౌలిలో ప్లాట్, సంగారెడ్డి జిల్లా.. జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, తెల్లాపూర్‌లో 2 ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్‌కి దగ్గర్లో 500 గజాల స్థలం, నాగోల్ పటాన్ పేరు, మోమిన్ పేట ప్రాంతాల్లో స్థలాలు, వ్యవసాయ భూమి, ముచ్చింతల్‌లో 4.20 ఎకరాల భూమి, కర్ణాటకలో 14 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగళూరు దేవనహళ్లిలో ఒక ఎకరం భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం భీమ్‌రెడ్డి స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. వాటిలో ఇంకెన్ని అక్రమాస్తులు వెలుగులోకి వస్తాయో ఇవాళ తెలియవచ్చు. ఐతే.. ఇంతలా అక్రమాలకు పాల్పడుతుంటే.. అదే పోలీస్ శాఖలోని ఎవరూ దీన్ని ఎందుకు అడ్డుకోలేదు? ఏళ్లకు ఏళ్లు అక్రమాలు చేస్తుంటే.. ఎందుకు పోలీస్ శాఖ ఇంటర్నల్‌గా చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎవరైనా ఆయనకు అండగా ఉంటున్నారా అనేది తేలాల్సి ఉంది.
Hyderabad,Telangana

