Last Updated:
Cyber Scam: ఎవరైనా ఒకసారి మోసపోతాడు.. రెండుసార్లు మోసపోతాడు.. కానీ, ఈ వ్యక్తి మాత్రం ఏకంగా 1,106 సార్లు మోసపోయాడు. లాభాల మోజులో ఉన్న ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్లకు టార్గెట్‌గా మారాడు. చివరకు కోట్లల్లో నష్టపోయాడు.
అత్యాశ, నకిలీ లాభాల ఎర సైబర్ నేరగాళ్లకు మరోసారి భారీ వేటగా మారింది. షేర్ మార్కెట్లో స్వల్ప కాలంలోనే రెట్టింపు లాభాలు వస్తాయంటూ సైబర్ కేటుగాళ్లు విసిరిన వలకు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి చిక్కారు. ఒకసారి, రెండుసార్లు కాదు.. ఏకంగా తొమ్మిది నెలల వ్యవధిలో 1,106 లావాదేవీల ద్వారా దాదాపు రూ. 3.73 కోట్ల సొమ్మును కేటుగాళ్లకు సమర్పించుకున్న నివ్వెరపరిచే ఘటన నగరంలో వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం.. హైదరాబాద్ హస్తినాపురంలోని అగ్రికల్చర్ కాలనీకి చెందిన 40 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి గత ఏడాది డిసెంబరు 9వ తేదీన వాట్సాప్‌లో పెట్టుబడులకు సంబంధించిన లింక్‌తో కూడిన ప్రకటన వచ్చింది. ఆ లింక్‌ను ఆయన క్లిక్ చేయడంతో, కొద్దిసేపటికే ‘జోషి’ అనే వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడాడు. తాము సూచించే ప్రముఖ కంపెనీల షేర్లలో నిధులు మదుపు చేస్తే కేవలం 6 నుంచి 8 నెలల్లోనే రెట్టింపు ఆదాయం వస్తుందని మాయమాటలు చెప్పి బాధితుడిని పూర్తిగా బురిడీ కొట్టించాడు.
ఆ మాటలను గుడ్డిగా నమ్మిన బాధితుడు కొత్త సంవత్సరం తొలి రోజు నుంచే పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. నేరగాళ్లు రూపొందించిన నకిలీ వెబ్సైట్లో ఖాతా తెరిచి, తనకున్న నాలుగైదు బ్యాంకు ఖాతాల ద్వారా నిరంతరం డబ్బును బదిలీ చేస్తూ వచ్చారు. బాధితుడు పెట్టిన ప్రతి పెట్టుబడికి అదనంగా భారీ బోనస్ వచ్చి చేరుతున్నట్లుగా ఆ వెబ్సైట్ తెరపై దృశ్యాలు కల్పించారు. పోగవుతున్న మొత్తాన్ని చూసి లాభాలు వెల్లువెత్తుతున్నాయని భ్రమించిన బాధితుడు మరింత ఉత్సాహంతో విడతలవారీగా డబ్బు పంపుతూనే ఉన్నారు.
కొంతకాలం తర్వాత తన ఖాతాలో ఉన్న డబ్బును విత్‌డ్రా (ఉపసంహరణ) చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా, కేటుగాళ్లు చాకచక్యంగా అడ్డుకట్ట వేశారు. మెచ్యూరిటీ గడువు కంటే ముందే నగదు తీసుకుంటే భారీగా పెరిగిన బోనస్ మొత్తం రద్దవుతుందని హెచ్చరించారు. మెచ్యూరిటీ కాలపరిమితి తక్కువగానే ఉందని నమ్మబలకడంతో, బాధితుడు వెనక్కి తగ్గి మరింత మొత్తం జమచేయడం సాగించారు. అనుమానం రాకుండా ఉండేందుకు ప్రత్యేక చాట్‌బాట్ ద్వారా సందేహాలకు సమాధానాలు ఇస్తూ ఆయనను నిరంతరం మభ్యపెట్టారు. ఈ క్రమంలో ఏకంగా 1,106 సార్లు రూ. 3.73 కోట్లను వారి ఖాతాలకు బదిలీ చేసినప్పటికీ, బాధితుడు ఈ వ్యవహారాన్ని తన కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదు.
చివరకు ఈ నెల 17న సదరు ఫేక్ వెబ్సైట్ పూర్తిగా నిలిచిపోయింది. రెండు రోజుల పాటు సర్వర్ సమస్య అనుకుని ఎదురుచూసిన బాధితుడు, వెబ్సైట్ ఎంతకీ పనిచేయకపోవడం, ఫోన్ నంబర్లు స్పందించకపోవడంతో తాను ఘోరంగా మోసపోయానని గ్రహించారు. దీంతో ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వ ‘నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (NCRP)లో ఫిర్యాదు చేయగా, గురువారం టీజీసీఎస్బీ పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత వాట్సాప్ లింకులు, అసాధారణ లాభాలు చూపే నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లను నమ్మి జీవితకాల సంపాదనను పోగొట్టుకోవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

