నెలవారీ జీతాన్ని సమర్థంగా నిర్వహించడానికి సులభమైన పద్ధతుల్లో 60-30-10 బడ్జెట్ నియమం ఒకటి. ఇందులో ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. అవసరమైన ఖర్చులు, జీవనశైలి ఖర్చులు, పొదుపు లేదా పెట్టుబడులు. నెలకు రూ.25,000 సంపాదించే వ్యక్తి ఈ విధానాన్ని పాటిస్తే రూ.15,000 అవసరమైన ఖర్చులకు, రూ.7,500 వ్యక్తిగత అవసరాలు, జీవనశైలి ఖర్చులకు, రూ.2,500 పొదుపు లేదా పెట్టుబడులకు కేటాయించవచ్చు. నెల ఆదాయంలో దాదాపు రూ.15,000 తప్పనిసరి ఖర్చుల కోసం కేటాయించాలి. ఇందులో ఇంటి అద్దె, కిరాణా సరుకులు, ఇంటి అవసరాలు, కరెంట్, ఇతర బిల్లులు, ప్రయాణ ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు, వైద్య అవసరాలు, మొబైల్, ఇంటర్నెట్ బిల్లులు వంటి వాటిని చేర్చవచ్చు. అవసరం లేని సబ్స్క్రిప్షన్లు, ఆలోచించకుండా చేసే కొనుగోళ్లు, అవసరం లేని వస్తువులపై తరచూ ఖర్చు చేయడం తగ్గిస్తే నెలవారీ డబ్బు ప్రవాహం మెరుగవుతుంది. బడ్జెట్ అంటే పూర్తిగా ఖర్చులు ఆపేయడం కాదని, ఏది ముఖ్యమో తెలుసుకోవడమేనని అఖిల్ కంచర్ల చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

