Last Updated:
సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపిస్తూ ఆమె తల్లి పార్వతీదేవి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడం, ఎన్నికల హామీలు నెరవేరకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సుగాలి ప్రీతి కేసు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఆయనపై చీటింగ్, నమ్మకద్రోహం, బహిరంగంగా తప్పుడు ఆరోపణలు చేయడం, ఆదివాసీ యువతి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం, నిందితులకు అనుకూలంగా వ్యవహరించడం, తొలి సంతకం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటి అంశాలపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
ఫిర్యాదు అనంతరం మాట్లాడిన పార్వతీదేవి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా తన కుమార్తె మరణ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ తమ ఇంటికి వచ్చి పరామర్శించి, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ప్రాధాన్యతగా సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని, ఇప్పుడు కేసుపై భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
తన కుమార్తె మరణంపై ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తున్నారని పార్వతీదేవి ఆరోపించారు. ఒక సందర్భంలో సుగాలి ప్రీతిపై లైంగిక దాడి జరిగి హత్య చేశారని చెబుతుండగా, మరోవైపు ఆధారాలు లేవని, నిందితులపై స్పష్టమైన సాక్ష్యాలు లేవని, డీఎన్ఏ ఆధారాలు లేవని, అత్యాచారం జరిగినట్లు నిరూపణ కాలేదని చెబుతూ కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం కోరిన ప్రతిసారీ పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడతారని, ఆ తర్వాత జనసేన నాయకులు తనపై విమర్శలు, దాడులకు దిగుతున్నారని కూడా ఆరోపించారు.
ఇటీవల యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు వ్యవహారాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఒక యూట్యూబర్‌ను అరెస్టు చేయడానికి ఐదు రోజుల పాటు సుమారు 500 మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను రంగంలోకి దింపారని పేర్కొన్నారు. అదే స్థాయిలో సుగాలి ప్రీతి కేసు దర్యాప్తుపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే ఇప్పటికి న్యాయం జరిగేదని అన్నారు. రావణ్ అరెస్టుకు చూపిన శ్రద్ధలో కనీసం పది శాతం అయినా తన కుమార్తె కేసుపై చూపి ఉంటే అసలు నిందితులు శిక్షపడేవారని వ్యాఖ్యానించారు.
పార్వతీదేవి ఆరోపణల ప్రకారం, సుగాలి ప్రీతి కేసులో నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని, కొందరు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో కూడా కనిపిస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నించారు. హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రిని పలుమార్లు కలిసి న్యాయం కోరినా ఫలితం లేకపోవడంతో చివరకు గన్నవరం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.
సుగాలి ప్రీతి కేసు 2017లో కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న సుగాలి ప్రీతి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో మృతదేహంగా కనిపించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లి పార్వతీదేవి ఆరోపించారు. పాఠశాల కరస్పాండెంట్ కుమారులపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారి 2019, 2024 ఎన్నికల సమయంలో కూడా ప్రధాన రాజకీయ అంశంగా మారింది.
ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కల్యాణ్ పలుమార్లు ఈ కేసును ప్రస్తావిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణపైనే ఉంటుందని హామీ ఇచ్చారని పార్వతీదేవి గుర్తుచేశారు. అయితే ఆ హామీ నెరవేరలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం తన కుమార్తె మరణ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిజమైన నిందితులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Hyderabad,Telangana

