చిట్టిబాబు (వెంకటేష్), స్వర్ణ (శ్రీనిధి శెట్టి), సంపూర్ణ, శర్వా.. ఇలా నలుగురిది ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, రోజువారీ కష్టాలతో వీరి జీవితం సాగిపోతుంటుంది. అలాంటి సమయంలో అనుకోకుండా ఈ కుటుంబానికి రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది. దీంతో ఒక్కసారిగా వీరి జీవితం మారిపోతుంది. అయితే అదే సమయంలో మరో ప్రమాదం వీరి ఇంటి తలుపు తడుతుంది.
ఒక బిహారీ గ్యాంగ్ ధనవంతుల ఇళ్లలో పనివాళ్లుగా చేరి, అదును చూసి వారిని హత్య చేసి డబ్బులు దోచుకుంటూ ఉంటుంది. రూ.100 కోట్ల లాటరీ గెలుచుకున్న చిట్టిబాబు కుటుంబంపై కూడా ఈ గ్యాంగ్ కన్ను పడుతుంది. దీంతో వారి ఇంట్లో పనివాళ్లుగా చేరుతుంది. మరోవైపు ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ దాము (నారా రోహిత్) ప్రయత్నిస్తుంటాడు. అసలు ఆ గ్యాంగ్ నుంచి చిట్టిబాబు కుటుంబం ఎలా బయటపడింది? పోలీసులకు ఎలా సహాయపడింది? అనేది మిగతా కథ.
సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే కుటుంబ అనుబంధాలు, వినోదం, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ ఈసారి ఆయన తన శైలికి క్రైమ్ థ్రిల్లర్ అంశాలను జోడించి కొత్త ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ ఎక్కువగా త్రివిక్రమ్ శైలిలో సరదాగా సాగుతుంది. వెంకటేష్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. మధ్య మధ్యలో వచ్చే క్రైమ్ ఎపిసోడ్స్ కథపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు కీలకమైన మలుపుగా నిలుస్తుంది. అప్పటివరకు నడిచిన కథ ఒక్కసారిగా మరో కోణంలోకి వెళ్లడంతో సెకండాఫ్‌పై ఆసక్తి ఏర్పడుతుంది.
అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. చాలా సీన్లు చిరాకు తెప్పిస్తున్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం అంతే సాగుతుంది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే దృశ్యం సినిమా గుర్తుకొస్తుంది. అయితే కుటుంబ భావోద్వేగాలను కొన్ని చోట్ల బాగా చూపించారు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఇంటర్వెల్ రేంజ్లో క్లైమాక్స్ కూడా ఉండుంటే సినిమా వేరే లెవల్లో ఉండేది. కానీ.. అందులో సగం కూడా మ్యాచ్ చేయలేకపోయింది. ఓవరాల్‌గా చూస్తే.. ఫస్ట్ హాఫ్ ఓకే.. సెకండ్ హాఫ్ మాత్రం బోర్ కొట్టిస్తుంది.
వెంకటేష్ మరోసారి తనకు బాగా అలవాటైన కుటుంబ కథానాయకుడి పాత్రలో అదరగొట్టారు. కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేశారు. చిట్టిబాబు పాత్రకు ఆయన నటన చక్కగా సరిపోయింది. శ్రీనిధి శెట్టి స్వర్ణ పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఆమె పాత్రలోని విభిన్న కోణాలు ఆకట్టుకుంటాయి. చిన్నారులుగా నటించిన ఇద్దరు పిల్లలు కూడా చక్కగా నటించారు. సత్య కామెడీ సినిమాకు మంచి రిలీఫ్. నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ దాము పాత్రలో ఆకట్టుకున్నారు. నివేదా పేతురాజ్, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
తమన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని చోట్ల గతంలో విన్నట్టుగా అనిపించినప్పటికీ సన్నివేశాలకు తగ్గట్టుగా సాగుతుంది. హిందీ పాటలు కూడా సినిమా మూడ్‌కు సరిపోయాయి. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా యాక్షన్, క్రైమ్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ తన మార్క్ పంచ్ డైలాగ్స్‌తో అలరించారు. యాక్షన్ పార్ట్ కూడా బలంగా ఉంది.
వెంకటేష్ నటన, కామెడీ టైమింగ్,
ఇంటర్వెల్ ట్విస్ట్,
సెకండాఫ్‌లో నెమ్మదించే కథనం,
అక్కడక్కడా దృశ్యం సినిమా ఛాయలు,
కొన్ని సన్నివేశాల్లో స్క్రీన్‌ప్లే సాగదీత
చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ తన రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫార్మాట్ నుంచి బయటకు వచ్చి క్రైమ్, యాక్షన్ అంశాలతో కొత్త ప్రయత్నం చేశారు. అయితే ఫస్ట్ హాఫ్‌ను ఒక హైలో చూపించిన త్రివిక్రమ్.. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ డిజప్పాయింట్ చేశాడు.
