ప్రసంగం ప్రారంభంలో ఖమ్మం జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయంగా పాలమూరు తనకు ప్రాణమైతే, ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని అన్నారు. 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఖమ్మం ప్రజలు ఉప్పెనలా తరలివచ్చి బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బతీశారని గుర్తుచేశారు. అదే జూలై నెలలో చింతకాని సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు బీఆర్ఎస్‌కు మరోసారి అవకాశం ఇవ్వబోమనే సందేశం ఇచ్చారని పేర్కొన్నారు.
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. రాబోయే రాజకీయ పోరాటాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోల్చిన ఆయన, కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయాల్లో పూర్తిగా ఓడించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రాంతి తీసుకోరని అన్నారు.
రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబరులో కాకుండా 2029 మే లేదా జూన్‌లో జరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అప్పటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగి ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని చెప్పారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 182 అసెంబ్లీ స్థానాల్లో 117 స్థానాలు గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటకు భద్రాచలం శ్రీరాముడి సాక్షిగా నిలుస్తానని, ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల విశ్వాసం కూడా ఇదేనని అన్నారు.
బీఆర్ఎస్ సర్వేలపై స్పందించిన సీఎం, ఎన్నికల తేదీలు ఖరారు కాకముందే, నియోజకవర్గాల సంఖ్య ఎలా ఉంటుందో తెలియకముందే గెలుపోటములపై సర్వేలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. కేసీఆర్‌ను ఉద్దేశించి దొంగ సర్వేలు చేయించే ఏజెన్సీలను ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని గుర్తుచేస్తూ, బీఆర్ఎస్ ఇప్పుడు ‘సర్వేల బ్యాచ్’గా మారిందని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకసారి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వల్లే భారీ నష్టం జరిగిందని, అలాంటి పరిస్థితిలో మళ్లీ నీళ్లు నిల్వ చేయాలని కోరడం బాధ్యతారాహిత్యమన్నారు. అలా చేస్తే భద్రాచలం ప్రాంతానికి ముప్పు ఏర్పడుతుందని, గతంలో ఖమ్మం జిల్లాలో 44 గ్రామాలు వరదలతో తీవ్రంగా నష్టపోయాయని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని బీఆర్ఎస్‌ను హెచ్చరించారు.
హరీష్ రావుపై కూడా సీఎం విమర్శలు గుప్పించారు. ఆయన బీజేపీలోకి వెళ్లబోరని కేసీఆర్‌పై ఒట్టు వేసి చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకులకే స్పష్టత లేదని, ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసే చర్చలు జరుగుతున్నాయని, ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లు బీఆర్ఎస్‌కు వందల కోట్ల రూపాయలు ఇచ్చారనే ఆరోపణలు కూడా వారి కుటుంబం నుంచే వచ్చాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, రైతు బంధు వంటి పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అందిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా మొత్తాన్ని రూ.12 వేలుకు పెంచామని, రైతు రుణమాఫీ అమలు చేసి రైతులను రుణ విముక్తులను చేశామని వెల్లడించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు పెరగనున్న 26 లోక్‌సభ స్థానాల్లో కనీసం 20 స్థానాలను కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలంటే తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు భారీ విజయాన్ని అందించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి మేరకు మధిరలో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, చివరగా “ఔర్ ఏక్ బార్… కాంగ్రెస్ సర్కార్” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
