Last Updated:
Mohsin Khan: కంప్లైంట్ ప్రకారం ఈ కేసు రూ.50లక్షల డబ్బుకి సంబంధించినదిగా తెలుస్తోంది. ఇందులో సినీ రంగానికి లింక్ ఉంది. ఈ కేసేంటో తెలుసుకుందాం.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు మొహసిన్ ఖాన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అల్లుడు, ఆయన బంధువు తబ్రేజ్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్, దాడి, బెదిరింపుల కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో బాధితుడు సినీ నిర్మాత వెంకట అనీశ్ రెడ్డి. ఆయన ఇటీవల ‘మహారాగ్ని’ అనే సినిమాను నిర్మించారు. పెట్టుబడిదారులను వెతికే సమయంలో మొహసిన్ ఖాన్, తబ్రేజ్‌లతో పరిచయం ఏర్పడిందని ఫిర్యాదులో తెలిపారు. సన్‌లిట్ గ్రూప్ ఎండీగా తనకు విస్తృత సంబంధాలు ఉన్నాయని, ఇన్వెస్టర్లను పరిచయం చేస్తానని చెప్పి మొహసిన్ ఖాన్ తన దగ్గర నుంచి రూ.25 లక్షలు తీసుకున్నట్లు అనీశ్ రెడ్డి ఆరోపించారు. తబ్రేజ్‌కు కూడా మూడు విడతల్లో రూ.25 లక్షలు ఇచ్చినట్లు బాధితుడు వివరించారు. డబ్బు తీసుకున్న తర్వాత పెట్టుబడిదారులను పరిచయం చేయకుండా తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారని సాక్షి రిపోర్ట్ చేసింది.
జూలై 1న బాధితుడు అనీశ్ రెడ్డి సన్‌లిట్ గ్రూపు కార్యాలయానికి వెళ్లి డబ్బు తిరిగి అడిగినప్పుడు మొహసిన్ ఖాన్ దురుసుగా ప్రవర్తించి, చెయ్యి చేసుకున్నారనీ, బౌన్సర్లతో దాడి చేసి మారణాయుధాలు చూపించి బెదిరించారని ఫిర్యాదులో వివరించారు. మొహసిన్ ఖాన్ తన దవడపై బలంగా కొట్టాడనీ, బౌన్సర్లు.. చేతులతో దాడి చేశారని అనీశ్ రెడ్డి పోలీసులకు తెలిపారు. తబ్రేజ్ ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించారని కూడా ఆరోపించారు. ప్రాణహాని భయం ఉందని కంప్లైంట్ ఇవ్వడంతో జూబ్లీహిల్స్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు.
మొహసిన్ ఖాన్‌పై గతంలో కూడా చీటింగ్ సంబంధిత కేసులు ఉన్నాయి. 2022 సెప్టెంబర్‌లో టోలిచౌకి వ్యాపారి మొహమ్మద్ అబ్దుల్ వహాబ్.. ఇసుక తవ్వకాల వ్యాపారంలో రూ.90 లక్షలు మోసం చేశారని కేసు పెట్టారు. అప్పట్లో ఏకే ఖాన్, మొహసిన్ ఖాన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలపై కూడా ఆరోపణలు వచ్చాయని ది హిందూ రిపోర్ట్ చేసింది. లేటెస్ట్ కేసు, పాత ఆరోపణలను మరోసారి గుర్తు చేస్తోంది.
పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మొహసిన్ ఖాన్, తబ్రేజ్‌లను దీనిపై ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటన హైదరాబాద్ సినీ, బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుటుంబం నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. అనీశ్ రెడ్డి ఫిర్యాదు ప్రకారం మొత్తం మోసం రూ.50 లక్షల వరకు ఉండవచ్చని రిపోర్టులు సూచిస్తున్నాయి.
Hyderabad,Telangana
Mohsin Khan: రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్ కుమారుడు మొహసిన్ ఖాన్‌పై చీటింగ్, దాడి కేసు.. సినీ నిర్మాత ఫిర్యాదు, జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు

