Last Updated:
పీఎన్‌బీ, భారత సైన్యం మధ్య ఒప్పందం కుదిరింది. సైనికులకు ప్రత్యేక ప్రయోజనాలతో రెండు క్రెడిట్ కార్డులు రూపొందించింది ఈ బ్యాంకు. పీఎన్‌బీ లక్సూరా మెటల్, పీఎన్‌బీ పరాక్రమ్ పేర్లతో ఈ కార్డులు ఇవ్వనుంది.
భారత సైన్యంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యేక ప్రయోజనాలు అందించే రెండు క్రెడిట్ కార్డులను తీసుకురావడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారత సైన్యంతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. ఈ కార్డులతో రోజువారీ ఖర్చులు, షాపింగ్, ప్రయాణం, వినోదానికి సంబంధించిన పలు ప్రయోజనాలు అందనున్నాయి. ఈ ఒప్పందం కింద ఆర్మీ అధికారులకు పీఎన్‌బీ లక్సూరా మెటల్ క్రెడిట్ కార్డును అందిస్తారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు (జేసీఓలు), ఇతర ర్యాంకుల సిబ్బందికి పీఎన్‌బీ పరాక్రమ్ క్రెడిట్ కార్డును అందిస్తారు. ఈ రెండు కార్డులతో పలు లైఫ్‌స్టైల్, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని పీఎన్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (సీఎస్‌డీ) ఔట్‌లెట్లలో చేసే కొనుగోళ్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని లాంజ్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఫారెక్స్ లావాదేవీలపై ఎలాంటి ఫారెక్స్ మార్కప్ ఉండదు. సినిమాలకు బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంటుంది. అంతేకాదు, ఉచిత గోల్ఫ్ పాఠాలు, ఇతర రివార్డ్‌లు, లైఫ్‌స్టైల్ ప్రయోజనాలు కూడా ఈ కార్డులతో అందుతాయి.

