ఆర్యా.ఏజీ 21 రాష్ట్రాల్లో పనిచేస్తోంది. దాని ప్లాట్‌ఫామ్‌తో 8.5 లక్షల మందికి పైగా రైతులు, సుమారు 12,000 గోదాములు అనుసంధానమై ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్లో మహిళలు నిర్వహించే ఎఫ్పీఓల సంఖ్య రెండేళ్లలో 128 శాతం పెరిగిందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం 50,000 మందికి పైగా మహిళలు నేరుగా ఈ వ్యవస్థలో భాగమయ్యారు. ఫ్రెండ్స్ ఆఫ్ విమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్‌తో కలిసి నిర్వహిస్తున్న ఆర్యాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలు నిర్వహించే ఎఫ్పీఓల సాయంతో 10,000 వ్యవసాయ కుటుంబాలకు మద్దతు అందిస్తున్నారు. అలాగే ఐఎఫ్‌సీతో కలిసి 25 లక్షల అమెరికన్ డాలర్ల విలువైన భాగస్వామ్యం ద్వారా చిన్న స్థాయి మహిళా ఆధ్వర్యంలోని సంస్థలకు పంట కోతకు ముందు, పంట కోత తర్వాత అవసరమైన ఫైనాన్స్ అందిస్తున్నారు. “మహిళా రైతులకు సరైన వనరులు అందితే పరిస్థితి ఎంతగా మారుతుందో మా నివేదిక స్పష్టంగా చూపిస్తోంది. ఫైనాన్స్, నిల్వ సదుపాయాలు, టెక్నాలజీ, వ్యవస్థీకృత మార్కెట్లకు అవకాశం లభిస్తే, దాని ప్రయోజనం ఒక్క మహిళా రైతుకే పరిమితం కాదు. ఆమె కుటుంబం, సమాజం, మొత్తం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు దాని ప్రభావం ఉంటుంది” అని ఆర్యా.ఏజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రసన్న రావు అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
