ఈ విషయాన్ని భారతీ ఎయిర్టెల్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో అధికారికంగా వెల్లడించింది. జూలై 12, 2026న విడుదలైన ఈ నివేదికలో కంపెనీ ఛైర్మన్ సునీల్ మిట్టల్ మాట్లాడుతూ.. ఎయిర్టెల్ మనీ (NBFC), డేటా సెంటర్లు మరియు క్లౌడ్ వ్యాపారాలపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఎయిర్టెల్ కొత్త వ్యూహాన్ని వివరించారు.
ఇప్పటివరకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కేవలం డబ్బు పంపడం, బిల్లులు కట్టడం వంటి పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పేమెంట్స్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వినియోగదారులకు రుణాలు ఇచ్చే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎయిర్టెల్ మనీకి ఎన్బీఎఫ్సీ (NBFC) లైసెన్స్ రావడంతో ఈ కింది సేవలు అందుబాటులోకి రానున్నాయి:
వ్యక్తిగత రుణాలు (Personal Loans) మరియు వ్యాపార రుణాలు (Business Loans)
ఫిక్స్డ్ డిపాజిట్లు (FDs) మరియు వివిధ రకాల బీమా (Insurance) సేవలు.
దీనివల్ల దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సరైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఒకే వేదికపై అన్ని రకాల ఆర్థిక సేవలు అత్యంత సౌకర్యవంతంగా లభించనున్నాయి.
ఈ కొత్త ఆర్థిక సేవల వ్యాపారాన్ని విస్తరించడానికి ఎయిర్టెల్ సుమారు ₹20,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతోంది. కంపెనీకి ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 కోట్లకు (400 మిలియన్లు) పైగా కస్టమర్లు బేస్ ఉంది. అందువల్ల కొత్త కస్టమర్లను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, ఇప్పటికే ఉన్న కోట్లాది మంది వినియోగదారులకే ఈ సరికొత్త డిజిటల్ ఫైనాన్స్ సేవలను చేరవేయడం కంపెనీకి పెద్ద కలిసివచ్చే అంశం.
ఎయిర్టెల్ కేవలం ఫైనాన్స్ రంగంపైనే కాకుండా భవిష్యత్తు సాంకేతిక అవసరాలపై కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది:
డేటా సెంటర్లు: ఎయిర్టెల్ అనుబంధ సంస్థ అయిన ‘నెక్స్ట్రా’ (Nextra), 1 గిగావాట్ డేటా సెంటర్ నెట్‌వర్క్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇటీవల 1 బిలియన్ డాలర్ల (సుమారు ₹8,400 కోట్లు) నిధులను సమీకరించింది.
క్లౌడ్ ప్లాట్‌ఫామ్: భారతీయ కంపెనీల డేటాను దేశంలోనే అత్యంత సురక్షితంగా ఉంచేందుకు వీలుగా ఒక క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. దీంతో పాటు సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలపై దృష్టి పెట్టింది.
గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా నెట్వర్క్, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎయిర్టెల్ ఇప్పటికే సుమారు ₹3.3 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఫైనాన్స్, డేటా సెంటర్లు, క్లౌడ్ రంగాలలోకి అడుగుపెడుతుండటంతో, రాబోయే రోజుల్లో ఎయిర్టెల్ కేవలం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌గానే కాకుండా, దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజీ కంపెనీగా ఎదగనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
